Hyderabad, October 14: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మహారాష్ట్ర వైపు కదులుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాగల 12 గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మంగళవారం నుంచి హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరం చిగురుటాకులా వణుకుతోంది. నగరంలోని అనేక కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వాయుగుండం హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో వాతావరణ శాఖ పసుపు హెచ్చరికను జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజుల పాటు నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. గురువారం వరకు సెలవులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయాలని అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేశారు.
అత్యవసర సేవల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు 040-211111111, జీహెచ్‌ఎంసి విపత్తు విభాగం - 9000113667, 9704601866, జీహెచ్‌ఎంసి విద్యుత్ విభాగం - 9440813750, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం - 833306853 మరియు 040 2955 5500 లను సంప్రదించవచ్చు. చెట్ల కొమ్మలు మరియు వేరుచేయబడిన చెట్లను తొలగించడానికి 6309062583 నెంబర్లకు డయల్ చేయవచ్చునని అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లోని సుమారు 1500 కాలనీలు వరద నీటితో నిండిపోయాయి, ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం మూలానా వాహనాలు నిలిచిపోయి తెలంగాణలోని కనీసం 14 జిల్లాలు ప్రభావితమయ్యాయి. గత 48 గంటల్లో 12 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. భారీ స్థాయిలో నీటి మట్టం పెరిగిన నేపథ్యంలో హైదరాబాదుకు నీటిని సరఫరా చేసే హిమాయత్ సాగర్ ఆనకట్ట యొక్క వరద గేట్లను అధికారులు తెరిచారు.
రానున్న 48 గంటల వరకు వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండనుంది. తెలంగాణలోని వికారాబాద్, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.