Amaravathi, June 18: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూ వేళలను పభుత్వం కుదించింది. ఇప్పుడున్న మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న కర్ఫ్యూ సడలింపులను సాయంత్రం 6 వరకు పొడగించారు. ఏపిలో ప్రస్తుత స్థితిగతులపై అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, తాజాగా నిర్ణయించిన సడలింపులు జూన్ 21 నుంచి అమలులోకి రానున్నాయి. మరోవైపు ఇప్పటికీ కరోనా కేసులు అధికంగా వస్తున్న తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ప్రస్తుతం ఉన్నట్లుగా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సడలింపులు ఉండనున్నాయి.
ఏపిలో ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే ఈ కర్ఫ్యూ గడువు ఈ నెల 20తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించారు, రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గింది, అలాగే రోజూవారీ కోవిడ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో జూన్ 21 నుంచి మరిన్ని సడలింపులు కల్పిస్తూ జూన్ 30 వరకు కర్ఫ్యూ పొడగించాలని సీఎం నిర్ణయించారు.
ఈ క్రమంలో సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలోని దుకాణాలు, కార్యాలయాలు మూసివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సాయంత్రం 6 తర్వాత కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.