Chirala, April 12: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియా (Sand Mafia) ఇష్టారీతన వ్యవహరిస్తోందని రుజువు చేసే మరో ఘటన వెలుగుచూసింది. శ్మశానాలను కూడా వదలకుండా తవ్వేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుక తెప్పించుకుంటే.. అందులో శవం (Dead Body Found In Sand) బయటపడింది. ఘటనపై ఆ ఇంటి యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పద్మనాభంపేటలో నివాసముంటున్న కాగితాల లక్ష్మి నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. బేస్ మట్టం పూడ్చేందుకు స్థానిక వ్యాపారులతో మాట్లాడి ట్రాక్టర్లతో ఇసుక తోలించారు. ఇంటి పని కోసం వచ్చిన కూలీలు బేస్ మట్టాన్ని నింపేందుకు ఇసుక తీస్తుండగా అందులో ఓ వ్యక్తి శవం బయటపడింది. దాంతో భయాందోళనకు గురైన కూలీలు విషయాన్ని ఇంటి యజమానికి తెలియజేశారు.
ఇంటి యజమాని లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇసుకలో బయటపడ్డ మృతదేహాన్ని రెండు రోజుల క్రితం పూడ్చిపెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జేసీబీతో ఇసుక తవ్వే క్రమంలో తల ఊడిపోయి ఉంటుందని, అందుకే మొండెం మాత్రమే మిగిలిందని పోలీసులు అనుమానిస్తున్నారు. చీరాల రూరల్ సీఐ సత్యనారాయణ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం ఎక్కడిది..? ఇసుక ఎక్కడ నుంచి తరలించారు..? ఇసుకలో మృతదేహం ఎలా వచ్చింది..? అసలు ఏం జరిగి ఉంటుంది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.