Amaravathi, December 26: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదన అమరావతిలో ప్రకంపనలు పుట్టిస్తుంది. రాజధానిని వికేంద్రీకరించవద్దంటూ అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు గత కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. గురువారం అమరావతి పరిధిలోని మందడం వద్ద రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. టెంట్ వేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు అక్కడే రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయానికి వెళ్లే మార్గాలను ప్రజలు దిగ్భందించారు. దీంతో పరిస్థితులు తప్పేలా ఉండటంతో భారీగా పోలీసు బృందాలు ఆ ప్రదేశానికి చేరుకున్నాయి.
ఇక తుళ్లూరు ప్రాంతంలో రాజధాని వికేంద్రీకరణను నిరసిస్తూ కొంతమంది రోడ్డుపైనే 'వంట-వార్పు' కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు సూర్యగ్రహణం ఉండటంతో చాలా మంది హిందువులు గ్రహణం సమయంలో వండకూడదని విశ్వసిస్తారు. అయితే రాజధాని అంశంలో తమ బ్రతుకులకు ఇప్పటికే గ్రహణం పట్టిందని, ఇక తమను ఏ సూర్యగ్రహణాలు ఏమి చేయవంటూ రోడ్డుపై వంటలు వండి నిరసన తెలిపారు.
మరోవైపు ఏపీ రాజధానిగా కేవలం అమరావతి మాత్రమే ఉండాలి, పాలన మొత్తం ఇక్కడ్నించే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 'రాజధాని పరిరక్షణ సమితి' విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అయితే పోలీసులు ఇందుకు అనుమతి నిరాకరించారు. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.
టీడీపీ నేతలను అడ్డుకోవడంపై ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని విమర్శించారు.
ఇక రేపు, డిసెంబర్ 27న సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల అమలు, రాజధాని అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమరావతిపై ఏం తేలుస్తారు? అంతకుముందు చెప్పినట్లుగా మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటారా? లేక నిరసనలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతాని ఆ నిర్ణయానికి వాయిదా వేస్తారా? అనే అంశంపై ఎవరికి వారు చర్చించుకుంటున్నారు. దీంతో రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠత నెలకొని ఉంది.