Amaravathi, January 2: ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital City) గా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు మలిదశ ఉద్యమానికి సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి 'సకల జనుల సమ్మె' (Sakala Janula Samme) చేపట్టాలని నిర్ణయించారు. గత 16 రోజులుగా అందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తూళ్లూరులో దీక్ష చేస్తున్న నిరసనకారులు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడి తమ నిర్ణయాన్ని ప్రకటించారు. శుక్రవారం నుంచి సకల జనులు సమ్మెలో పాల్గొని అమరావతి ఉద్యమాన్ని (Amaravathi Protests) ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నిత్యావసరాలు, అత్యవసర సేవలు మినహా మిగతా కార్యాలయాలు, సేవలు నిలిపివేయాలని నిర్ణయించారు.
మూడు రాజధానుల అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రభుత్వానికి తమ నివేదిక అందజేయనుంది. ఈ క్రమంలో సచివాలయం, సీఎం కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించారు.
మరోవైపు, అమరావతి కాకుండా రాజధానిని వికేంద్రీకరిస్తున్నందున్న తమకు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి మరియు సుప్రీం ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాస్తున్నారు. తద్వారా తమ సమస్య జాతీయ స్థాయిలో చర్చ జరగాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రజాగ్రహానికి గురైతే ప్రభుత్వాలు పడిపోతాయంటూ హెచ్చరిస్తున్నారు. అమరావతి అంశం: జనవరి 21 లోపు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు
ఇదిలా ఉండగా, కొన్ని గ్రామాలు కలిసి సేవలు నిలిపివేస్తే తమంతటతామే ఇబ్బందులు కొని తెచ్చుకోవడం తప్ప, దానితో ఒరిగేదేమి లేదని కొన్ని వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అమరావతి నిరసనలు కేవలం ఒక సామాజిక వర్గం, టీడీపీ మరియు వారి అనుబంధ మీడియా సృష్టి అని, స్వార్థంతో అమరావతి నిరసనలను టీడీపీ మీడియా పెద్దది చేసి భారీ స్థాయిలో చూపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వంపై ఉన్న సానుకూలతను చూపించడం లేదంటూ వైకాపా శ్రేణులు పేర్కొంటున్నాయి.