Hyderabad, JAN 08: ఏపీలో తీసుకువచ్చిన జీవో నంబరు 1కి (GO NO.1) అడ్డుకట్ట వేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu), తాను చర్చించానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అలాగే, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై చర్చించామని చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడితో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిశాక చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న అరాచక పాలనపై చర్చించామని అన్నారు. అలాగే, వైసీపీని సంయుక్తంగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చిస్తామని, త్వరలో బీజేపీతో కూడా చర్చిస్తానని చెప్పారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం చీకటి జీవోలను తీసుకొచ్చిందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం తమ బాధ్యత అని చెప్పారు. ఏపీలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షే పథకాలు సరిగ్గా అమలు కావట్లేదని అన్నారు. ప్రజల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని చెప్పారు.
కుప్పం సంఘటన దృష్ట్యా తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు @ncbn గారికి సంఘీభవం తెలిపిన జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/c2j0uqDMBt
— JanaSena Party (@JanaSenaParty) January 8, 2023
అంతేగాక, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు ఉండే హక్కులను కూడా వైసీపీ (YCP) సర్కారు అణచివేస్తోందని విమర్శించారు. బ్రిటిష్ కాలం నాటి జీవో తీసుకువచ్చి, ప్రతిపక్ష నేతలను ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు వారు తీసుకొచ్చిన నిబంధనలను వారే పాటించడం లేదని చెప్పారు. ఏపీలో ఫ్లెక్సీల నిషేధం అని చెప్పారని, అయితే, సీఎం జగన్ జన్మదినం వేళ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ మంత్రుల తీరు బాగోలేదని పవన్ కల్యాణ్ అన్నారు. మంత్రులు అంబటి రాంబాబు, అమర్‌నాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీ పాచినోళ్ల నుంచి అటువంటి వ్యాఖ్యలే వస్తాయని విమర్శించారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ ఏపీకి రావడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఏ రాజకీయ పార్టీలోనైనా చేరికలు సహజమని చెప్పారు. కాగా, పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ ఆసక్తి రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేసే విషయంపై వారు చర్చించారని కూడా ఊహాగానాలు వస్తున్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం ఉమ్మడి మీడియా సమావేశం.
— Telugu Desam Party (@JaiTDP) January 8, 2023
ఇక రాజకీయాల్లో పొత్తులు సహజమని, గతంలోనూ పలు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. పొత్తులపై మాట్లాడడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. గతంలో తాము టీఆర్ఎస్ తోనూ పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తో విభేదించామని అన్నారు. రాజకీయాల్లో సమీకరణాలు ఎల్లప్పుడూ మారుతుంటాయని చెప్పారు. ఏ సమయంలో ఏం చేయాలన్న దానిపై రాజకీయ పార్టీలకు ప్రణాళికలు ఉంటాయని తెలిపారు. ఇటీవల వైసీపీ మాపై ప్రవర్తించిన తీరు గురించి సంఘీభావం తెలిపిన పవన్ కల్యాణ్ కు అభినందనలు చెబుతున్నాని అన్నారు. ఏపీలో వైసీపీ నేతలు భయంకరమైన పరిస్థితులను తీసుకొస్తున్నారని చంద్రబాబు చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ @ncbn గారితో భేటీ అయిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
రాష్ట్రంలో ఉన్న అరాచక, అప్రజాస్వామిక పాలనపై ఇరువురూ చర్చించారు.#NaraChandrababuNaidu #PawanKalyan pic.twitter.com/12ALy9QNIq
— Telugu Desam Party (@JaiTDP) January 8, 2023
తాము పరామర్శకు పోతే 2వేల మందితో గొడవచేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం భ్రష్టుపట్టిందని చెప్పారు. ఏపీలో ఆంక్షలతో పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఆంక్షలతో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారని, కుట్ర రాజకీయాలను తిప్పికొడతామని అన్నారు. అమరావతి రైతులకు సంఘీభావం కోసం వెళ్తే వైసీపీ వాళ్లు రాళ్లు, కర్రలతో దాడులు చేశారని చెప్పారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడితే తమ కార్యాలయంపై దాడులు చేశారని అన్నారు. ఏపీలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయని చెప్పారు. ఏపీలో ఒక ఉన్మాదిని ఎదుర్కొంటున్నామని మండిపడ్డారు.