Amaravathi, December 27: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meet) శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర మూలధనం, పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజధాని విషయంలో జీఎన్ రావు కమిటీ (GN Rao Committee) సమర్పించిన నివేదికపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అలాగే కొత్త 104, 108 వాహనాల కొనుగోలు, దేవాలయాలలో పాలక మండలి నియామకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఇవే కాకుండా స్థానిక ఎన్నికలలో అమలు చేయాల్సిన రిజర్వేషన్లు, రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండలాల ఏర్పాటుపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే టీడీపీ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి వాస్తవాలు వెలికితీసేందుకు ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ సమర్పించే నివేదికపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
ఇక ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు నేటితో పదో రోజుకు చేరుకున్నాయి. నేడు కేబినేట్ సమావేశం ఉన్న నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి అమరావతి రైతులు నిరాహార దీక్షకు కూర్చున్నారు. మా బతుకులకే గ్రహణం పట్టింది.. అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న నిరసనలు
కేబినెట్ సమావేశం నేపథ్యంలో, అమరావతి ఆందోళనలు తీవ్రతరం కాకుండా భారీగా బలగాలను మోహరించారు. మూడు రాజధానుల ఆలోచనలు విరమించుకోవాలని కోరుతూ రియల్టర్లు, న్యాయవాదులు మరియు వర్తక- వాణిజ్య సంఘాలు జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తున్నాయి. వీరి పోరాటానికి విపక్షాలు మద్ధతు తెలిపాయి.
వెలగపూడిలో రోడ్డుకు అడ్డంగా మహిళలు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి, ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదానికి దిగారు, ఆ సమయంలో వచ్చిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సీఐ, ఎస్సైలకు గాయాలయ్యాయి.
మందడంలో మరోసారి తీవ్రఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ పోలీసులు విధించిన 144 సెక్షన్ ను లెక్కచేయకుండా పెద్ద ఎత్తున మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ఇక గొల్లపూడిలో కూడా మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వేలాది మంది రైతులు, మహిళలు జాతీయ రహదారిపై తరలివచ్చారు. వీరికి సంఘీభావంగా టీడీపీ నేత దేవినేని ఉమతో పాటు, పలువురు టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనలో పాల్గొన్నారు. అయితే పోలీసులు దేవినేని ఉమను అదుపులోకి తీసుకొని, అక్కడ్నించి తరలించారు. దీంతో పోలీసుల చర్యను నిరసిస్తూ నిరసనకారులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రాజధాని విషయంలో మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది.