చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 54మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా వుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ ఘోరం చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయమయ్యింది. ఈ క్రమంలోనే ఇవాళ(ఆదివారం) తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేసారు. ఇందుకోసం వేణు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఓ ప్రైవేట్ బస్సులో చిత్తూరుకు బయలుదేరారు.
ఈ క్రమంలో ఎంతో ఆనందంగా సాగుతున్న వీరి ప్రయాణంలో ఒక్కసారిగా ఏడుపులు, పెడబొబ్బలు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లాలో భాకరావుపేట ఘాట్ రోడ్డుపై వెళుతుండగా దొనకోటి గంగమ్మ దేవాలయం సమీపంలోని బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఓ మలుపు వద్ద ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా మలుపు రావడంతో డ్రైవర్ బస్సును అదుపుచేయలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా బస్సు లోయలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాద సమయంలో బస్సులో 60మందికి పైగా వున్నారు. వీరిలో తొమ్మిదిమంది అక్కడిక్కడే మృతిచెందగా మరో 54మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బస్సు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
బస్సు అరవైఅడుగుల లోయలో పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా వున్నట్లు సమాచారం. బస్సులో ఎక్కువమంది వుండటంతో ఒకరిపై ఒకరు పడిపోయి ఊపిరాడక, గాయాలపాలై కొందరు మృతిచెందగా మరికొందరు కాళ్లుచేతులు విరగడం, తలలు పగలడంతో పాటు ఇతర గాయాలపాలయ్యారు. ముందుగా పోలీసులు క్షతగాత్రులను తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
రాత్రి సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడం... బస్సు పడిపోయిన లోయలోకి వెళ్లడానికి వీలుకాకపోవడంతో సహాయకచర్యలకు ఆటంకం కలిగింది. ఎలాగోలా క్షతగాత్రుల వద్దకు చేరుకుని హాస్పిటల్ కు తరలించడంతో చాలామంది ప్రాణాలు దక్కాయి. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నవారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదంపై సమాచారం అందినవెంటనే చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ అప్పలనాయుడు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.