 
                                                                 Mogalthur, Sep 29: రెబల్‌స్టార్ కృష్ణంరాజు గౌరవార్థం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం (krishnam Raju Smruthi Vanam) ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో ( Mogalthur west godavari) ఇవాళ జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఏపీ ప్రభుత్వం తరపున టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా..మంత్రులు కారుమూరి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజుతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలసి మంత్రులంతా కలిసి సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు మరణంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారని, సినీ-రాజకీయ రంగాల్లో రాణించిన ఆయన మృతి ఆయా రంగాలకు తీరని లోటని మంత్రి రోజా అన్నారు. ఆయన పేరిట మొగల్తూరు తీర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల స్థలం రాష్ట్ర టూరిజం డిపార్ట్‌మెంట్ తరపున కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని, రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని, ఇదే విషయాన్ని కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సైతం తెలిపామని వెల్లడించారు.
దివంగత నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) సంస్మరణ సభ సందర్భంగా మొగల్తూరు జన సంద్రాన్ని తలపించింది. ఇటీవల కన్నుమూసిన కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని ప్రభాస్ సహా కుటుంబ సభ్యులు స్వగృహంలో గురువారం నిర్వహించారు. ప్రభాస్ వస్తున్నాడనే విషయం తెలియడంతో చుట్టు పక్కల గ్రామాల వారితోపాటు సుదూర ప్రాంతాలకు చెందిన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
వీరిలో పలువురు ప్రభాస్ చూసేందుకు చెట్లపైన, ఎత్తైన భవంతులపైకెక్కారు. సెక్యూరిటీ దృష్ట్యా ప్రభాస్ తమ ఇంటిలో నుంచే అభిమానులకు అభివాదం చేసి, వారిలో ఉత్సాహం నింపారు. వచ్చిన ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్లాలని ప్రభాస్ కోరారు. సంబంధిత ఫొటోలు, వీడియోలతో నెట్టింట #PrabhasatMogalthuru హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
