Vjy, Dec 16: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రం వాల్, గైడ్ బండ్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందని ప్రశ్నించగా.. రూ.1200 కోట్లకు పైగా అవుతుందని అధికారులు తెలిపారు. అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి, పోలవరం ప్రాజెక్టు పనుల షెడ్యూల్‌ను ప్రకటించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోందని తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని అధికారులకు చెప్పానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధ్యపడుతుందన్నారు.
విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ‘‘ పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ అవుతుంది. పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశాం. రాబోయే రోజుల్లో నేరుగా కృష్ణా నుంచి నాగార్జున సాగర్ కెనాల్‌కు అనుసంధానం చేయాలి. గొల్లపల్లి రిజర్వాయర్ వస్తే చాలావరకు ఇబ్బంది ఉండదు. వెలిగొండ ఇరిగేషన్‌కు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి బనకచర్లకు నీటిని తీసుకెళ్లొచ్చు.
నేరుగా నీటిని విశాఖకు కూడా తరలించి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అక్కడి నుంచి వంశధారకు వెళ్తుంది. ఈ పనులన్నీ పూర్తి చేయగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఉపయోగం ఉంటుంది. శ్రీకాకుళం నుంచి కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి వరకు నీటి సమస్య ఉండదు. ప్రాజెక్టు ప్రాముఖ్యత చూస్తే 50 లక్షల క్యూసెక్కులు డిశ్చార్జ్ చేసే సామర్థ్యం ఉంది. 93 మీటర్లు డయా ఫ్రం వాల్.. అత్యంత ఎత్తైన స్పిల్ వే గేట్లు ఏర్పాటు చేస్తున్నాం. బహుళ ప్రయోజనాల కోసం వినియోగించే ప్రాజెక్టు పోలవరం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
‘‘ 2014 నుంచి 2019 వరకు రేయింబవళ్లు పని చేశాం. ముందుజాగ్రత్త చర్యతో 2014లో సీఎం కాగానే ఏడు ముంపు మండలాలు ఇవ్వకపోతే ప్రమాణం చేయనని చెప్పా. మొదటి కేబినెట్ పట్టుకొని 7 మండలాలు ఇచ్చిన తర్వాతే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఒక్క రోజులో స్పిల్ ఛానల్‌లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డు కూడా బ్రేక్ చేశాం. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు రెండూ పూర్తి చేశాం. డయాఫ్రం వాల్‌ను 414 రోజుల్లో పూర్తి చేశాం. 2కి.మీ పొడవుతో దాదాపు 100 మీటర్ల డయాఫ్రం వాల్‌కు కూడా శ్రీకారం చుట్టాం. ప్రతి పనిని పీపీఏ, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతిస్తూ వచ్చారు. 72 శాతం పనులు పూర్తి చేశాం. 28 సార్లు క్షేత్ర పరిశీలన చేశా. 82 సార్లు వర్చువల్‌గా సమీక్షలు చేశా. సోమవారాన్ని పోలవరంగా చేసుకొని సమీక్షలు చేశాం.
గత ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే పోలవరం కాంట్రాక్టర్‌ను మారుస్తామని చెప్పారు. బలవంతంగా 2019 జులైలో నోటీసులిచ్చి సైట్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చారు. 15 నెలల పాటు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. 50 లక్షల క్యూసెక్కుల నీళ్లు డిశ్చార్జ్‌కు మనం నిర్మాణాలు చేశాం. ఆగస్టు, అక్టోబరులో వరదలకు డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతింది. దాని తర్వాత పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. పట్టించుకోలేదు. అసమర్థత, అవగాహనరాహిత్యం, అవినీతి, కుట్ర, అన్నీ కలిపి ప్రాజెక్టును నాశనం చేశారు.’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.