
Chittoor, January 9: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) ప్రతిష్ఠాత్మకమైన 'అమ్మ ఒడి' (Amma Vodi) పథకాన్ని గురువారం చిత్తూరులో ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు, జగన్ చెప్పిన కీలక నవరత్నాలలో ఒకటైన అమ్మ ఒడి పథకం తన పాద యాత్ర పూర్తై ఏడాదైన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాటను అధికారికంగా నెరవేర్చారు. ప్రజలకు ఈ పథకం అంకితం ఇస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు.
సీఎం జగన్ మాట్లాడుతూ "ప్రతి బిడ్డ తల్లి ఒడిలో పెరుగుతుంది. ఆ తల్లి తన పిల్లల కోసం అన్నింటినీ త్యాగం చేస్తుంది. తన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మంచి విద్యను అందించాలని ఆ తల్లులు కోరుకుంటారు, కానీ వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా అది జరగడం లేదు. ఈ పరిస్థితి పోవడానికి, అలాంటి తల్లులకు సహాయం చేయడానికి మరియు వారి పిల్లలను పాఠశాలలకు పంపించడానికి నేను ఈ పథకాన్ని తీసుకురావాలని కోరుకున్నాను, నేడు ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది" అని జగన్ అన్నారు.
ఈ పథకం ప్రకారం 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతి పేదవారు చదువుకునేలా, తమ పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు వారి బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా ఏడాదికి రూ. 15,000/- జనవరి నెలలో జమ చేయబడతాయని సీఎం అన్నారు. మేనిఫెస్టోలో 1 నుంచి 10వ తరగతి వరకే అని చెప్పినప్పటికీ దానిని ఇంటర్ వరకు అమలు చేస్తున్నామని సగర్వంగా చెబుతున్నామని సీఎం అన్నారు.
దీనితో 42.12 లక్షల పేద తల్లులకు లబ్ది చేకూరనుంది. ఈ పథకానికి అర్హులై, లబ్ది పొందని తల్లులు ఫిబ్రవరి 9లోపు తమ వివరాలు నమోదు చేసుకోవాలని సీఎం సూచించారు.
వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తామన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ అక్ష్యరాస్యత సాధనే లక్ష్యం అని సీఎం జగన్ ఉద్ఘాటించారు.
వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ఒక్కో సంవత్సరం పెంచుకుంటూ పోతామని స్పష్టం చేశారు. ఆంగ్లమాధ్యమంలో సమస్యలు ఎదుర్కొనే విద్యార్థుల కోసం బ్రిడ్జి కోర్సులు కూడా ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. 2040 నాటికి ఏపీ పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడే స్థాయికి చేరుకుంటారని సీఎం జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.