Amaravati, Nov 21: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం దిశగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మత్స్యకారుల అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కారు కీలక ముందడుగు (Fishing Harbours in AP) వేసింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం (World Fisheries Day) సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో శనివారం శంకుస్థాపన (CM Jagan Lays Foundation for Fishing Harbours) చేశారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతోపాటు 25 ఆక్వాహబ్‌ల నిర్మాణ పనులకు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ఏపీలో 974 కి.మీ తీరప్రాంతం ఉంది. మత్స్యకారుల జీవితాలు దయనీయస్థితిలో ఉండటం పాదయాత్రలో చూశా. సరైన సౌకర్యాలు లేక గుజరాత్‌లాంటి ప్రాంతాలకు వలస పోవడం చూశాం. పెద్ద సముద్రతీరం ఉన్నా అవసరమైన ఫిషింగ్ హార్బర్లు లేవు. మత్స్యకారుల జీవితాలు మార్చేందుకు ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు.
AP CMO Tweet
On the occasion of #WorldFisheriesDay, Hon'ble Chief Minister @ysjagan laid the foundation stone of 4 fishing harbours & 25 aqua hubs across the state. The CM said that overall 8 new fishing harbours will be constructed in 2 phases, at an expenditure of Rs. 3000 Crore. pic.twitter.com/EvmgE0qj9u
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 21, 2020
నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వాహబ్‌లకు శంకుస్థాపన చేశాం. మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె, ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ల నిర్మిస్తున్నాం. దీంతోపాటు నియోజకవర్గానికో ఆక్వాహబ్ నిర్మాణం చేపడుతున్నాం. జనతా బజార్లలో నాణ్యమైన రొయ్యలు, చేపలను అందుబాటులోకి తెస్తాం. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో మరో 3 పోర్టుల నిర్మాణాన్ని చేపడుతామని తెలిపారు.
ఇక వేట నిషేధ సమయంలో ఆదాయం కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.10వేలు చొప్పున లక్షా 2వేల 337 కుటుంబాలకు ఇచ్చామని అన్నారు. డీజిల్ సబ్సిడీని రూ.6 నుంచి రూ.9కి పెంచామని..వేట సమయంలో ప్రమాదవశాత్తు మత్స్యకారులు చనిపోతే అందించే రూ.5 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచామని సీఎం గుర్తు చేశారు. ఆక్వా రైతులకు యూనిట్ కరెంట్‌ను రూపాయిన్నరకే అందిస్తున్నామని సీఎం అన్నారు. క్వాలిటీ కోసం ఆక్వా ల్యాబ్స్‌ను కూడా ఏర్పాటు చేశామని, పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆర్డినెన్స్ తెచ్చాం’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.