CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, May 12: ఉన్నత విద్యపై ఏపీ సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు మేలు చేసేలా ప్రమాణాలు పెంచాలని, దేశంలో టాప్‌ టెన్‌లో రాష్ట్రంలోని యూనివర్సిటీలు నిలవాలని పేర్కొన్నారు. అదే విధంగా.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో యూనివర్శిటీలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లడంపై అధికారులతో చర్చించారు.

ఈ సమావేశానికి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, ఆర్‌జీయూకేటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కెసి రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

విద్య, వైద్య రంగాలకు (Education and Health) ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగా పెద్ద ఎత్తున నాడు–నేడు కార్యక్రమం (Naadu Nedu Program) కొనసాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Review Meeting) అన్నారు. యూనివర్సిటీలలో అన్ని ప్రమాణాలు పెరగాలని, ఆమేరకు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జేఎన్టీయూ రెండు యూనివర్సిటీలు (కాకినాడ, అనంతపురం), ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు, ట్రిపుల్‌ ఐటీలను ఇప్పడున్న పరిస్థితి నుంచి మెరుగైన పరిస్థితిలోకి తీసుకువెళ్లడంపై కార్యాచరణ రూపొందించండి.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, కోవిడ్‌తో అనాథలైన పిల్లల కోసం కేర్ సెంటర్స్, మొత్తం 13 జిల్లాల్లో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం

ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్ని నిధులు అవసరమో చెప్పండి. కడపలో రానున్న ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో ఏయూ ప్రస్తుతం 19వ స్థానంలోనూ, ఎస్వీ యూనివర్సిటీ 38వ స్థానంలోనూ ఉన్నాయి. రెండేళ్లలో వీటి స్థానాలు గణనీయంగా మెరుగుపడడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టండని అధికారులను ఆదేశించారు.

విదేశాల్లోని అత్యుత్తమ యూనివర్సిటీల పద్దతులను, విధానాలను కూడా అధ్యయనం చేసి వాటిని మన యూనిర్సిటీల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వారి పాఠ్య ప్రణాళికలను ఇక్కడ అనుసంధానం చేసుకోవడంపైనా దృష్టి పెట్టాలి. బోధనతో పాటు, కోర్సులకు సంబంధించి విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోండి. ట్రిపుల్‌ ఐటీల్లో ప్రస్తుతం 22,946 మంది విద్యార్థులు ఉన్నారు. శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్‌ ఐటీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.

ట్రిపుల్‌ ఐటీలకు సంబంధించి రూ.180 కోట్లకు పైగా నిధులను మళ్లించారు. కాబట్టి వాటిని ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఇప్పుడున్న మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ఇందుకోసం కార్యాచరణ రూపొందించండి. ట్రిపుల్‌ ఐటీల్లో మంచి బిజినెస్‌ కోర్సులను ప్రవేశపెట్టడంపైనా దృష్టి పెట్టండి. ఈ కోర్సులు అత్యుత్తమంగా ఉండాలి.ఇంజినీరింగ్‌ కోర్సులు కూడా మంచి నైపుణ్యం ఉన్న మానవవనరులను అందించేలా చూడాలని కోరారు.

కరోనా నుంచి కోలుకున్న స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం దంపతులు, వైద్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసిన ఏపీ స్పీకర్‌, క‌రోనా క‌ష్ట‌కాలంలో రాజ‌కీయ ల‌బ్ది కోసం మాట్లాడ‌టం స‌రికాద‌ని సూచన

రాష్ట్రంలో ఇప్పటివరకూ 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా మరో 16 మెడికల్‌ కాలేజీలను తీసుకువస్తున్నాం. మెడికల్‌ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. ఆ కాలేజీలను మెరుగ్గా నిర్వహించడానికి చక్కటి విధానాలు పాటించాలి. ఆ కాలేజీల్లో 70 శాతం సీట్ల కన్వీనర్‌ కోటాలోనూ, మిగిలిన 30 శాతం సీట్లు పేమెంటు కోటాలో ఉండేలా ఆలోచన చేయండి. సీట్ల సంఖ్య పెరుగుతుండడంతో పేద విద్యార్థులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయి. అంతే కాకుండా ప్రతి కాలేజీ కూడా స్వయం సమృద్ధితో నడుస్తుంది. దీంతో నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిపారు.

విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ బాగు పడాలనే తపనతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. అందు కోసం పెద్ద ఎత్తున నాడు–నేడు కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఈ సంస్థలన్నింటినీ అత్యుత్తమంగా నడుపుకునేలా చక్కటి విధానాలను తీసుకురావాలి. వీటన్నింటిపైనా అధికారులు మూడు, నాలుగు సార్లు సమావేశమై విధానాలు రూపొందించాలి. అదే విధంగా సంస్కరణలు తీసుకు రావాలి. ఆ మేరకు అవసరమైన బిల్లులను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. ఇంకా గ్రామ సచివాలయాల సిబ్బందికి ఇచ్చే శిక్షణను ట్రిపుల్‌ ఐటీలతో కలిసి నిర్వహించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యాక్రమాలను కూడా ట్రిపుల్‌ ఐటీలు నిర్వహించాలి అని సమీక్షా సమావేశంలో సీఎం జగన్‌ నిర్దేశించారు.