AP YS Jagan- Job Calendar | Photo: FB

Amaravathi, June 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. జాబ్‌ క్యాలెండర్‌ను సీఎం విడుదల చేశారు.  2021 జూలై  నుంచి 2022  మార్చి వరకు భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులు, సిఫార్సులు, పైరవీలకు తావు లేకుండా కేవలం మెరిట్‌ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని సీఎం స్పష్టం చేశారు.

"అవినీతికి, పక్షపాతానికి, వివక్షకు, లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా, ఎలాంటి పైరవీలకు, దళారులు తావులేకుండా ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి చెబుతూ.. రాత పరీక్షల్లో మెరిట్‌ ప్రాతిపదికన ప్రభుత్వం ఉద్యోగాలిస్తోందని చెప్పడానికి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తున్నాం’’ అని సీఎం జగన్ అన్నారు.

జాబ్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతీ, యువకులు, చదువుకుంటున్న విద్యార్థులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ .. ‘ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్‌ వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న పిల్లలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. నగరాలు, పట్టణాలకు వెళ్లి అద్దె ఇల్లు తీసుకొని నెలల తరబడి కోచింగ్‌ తీసుకుంటారు. కోచింగ్‌ తీసుకున్న తరువాత ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడిస్తారని తెలియని పరిస్థితుల్లో ఆ పిల్లలు మనోధైర్యం కోల్పోయే స్థితి వస్తుంది. ఆ పరిస్థితులను మారుస్తూ.. వచ్చే 9 నెలల కాలంలో జూలై నెల నుంచి మార్చి – 2022 వరకు ఏయే ఉద్యోగాలకు, ఏయే నెలలో నోటిఫికేషన్‌ ఇవ్వబోతున్నామని జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం' అని పేర్కొన్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్

జూలై 2021 - ఎస్సీ, ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ 1,238

ఆగస్టు 2021- ఏపీపీఎస్సీ గ్రూప్‌ I, గ్రూప్‌II 36

సెప్టెంబర్‌ 2021 - పోలీస్‌ శాఖ ఉద్యోగులు 450

అక్టోబర్‌ 2021- వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 451

నవంబర్‌ 2021-  పారామెడికల్‌ సిబ్బంది 5,251

డిసెంబర్‌ 2021 - నర్సులు 441

జనవరి 2022-  డిగ్రీ కాలేజీల లెక్చరర్లు 240

ఫిబ్రవరి 2022-  వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 2,000

మార్చి 2022 - ఇతర శాఖలు 36

భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు: 10,143

రాష్ట్రంలోని ప్రతి విద్యార్థిని గ్రాడ్యుయేట్‌ చదివించేలా, చదువుకున్న ప్రతి విద్యార్థికి అవకాశాలు విస్తరించే దిశగా యుద్ధ ప్రతిపాదికన అడుగులు వేస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో అక్షరాల 6,03,756 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయగలిగామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

కాగా, ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యం కల్పించారు. 2021, జూలై నుంచి ఉద్యోగ నిమామకాలు చేపట్టనున్నట్లు అందులో సూచించారు.