Amaravati, Feb 21: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గౌతమ్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. గుండెపోటుతో మరణించిన గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు ( CM YS Jaganmohan Reddy pays tribute to IT Minister) అర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. మేకపాటి మరణవార్త విని ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చెందారు. సహచరుణ్ని కోల్పోయిన బాధ మాటల్లో చెప్పలేనిదని జగన్ అన్నారు.
ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ( IT Minister Mekapati Goutham Reddy) అకాల మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం చాలా బాధకరమని అన్నారు. జూబ్లీహిల్స్‌లోని మేకపాటి ఇంట్లో గౌతంరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్దాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విధి వైపరీత్యాన్ని ఎవరూ నివారించలేరని ఆయన పేర్కొన్నారు. చాలా తక్కువ సమయంలో గౌతంరెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. వివాదాల జోలికి పోకుండా హుందాగా, సమర్ధవంతం గా పని చేసిన వ్యక్తి మనందరి మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
గౌతమ్‌రెడ్డి మృతి పట్ల కేవీపీ రామచంద్రరావు సంతాపం తెలిపారు. గౌతమ్‌రెడ్డి మరణం చాలా బాధాకరమన్నారు. గౌతమ్‌రెడ్డి ఉన్నత ఆశయాలు, విలువలు కలిగినవారన్నారు. ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాని కేవీపీ అన్నారు. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి నివాళుర్పించారు.
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని గౌతమ్ రెడ్డి ఇంటికి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం వెళ్లారు. గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి కేటీఆర్ నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డితో తనకు 12 ఏండ్లుగా పరిచయం ఉందన్నారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న నాయకుడు గౌతమ్ రెడ్డి అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని కేటీఆర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ట జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి కన్నుమూశారనే విషయం నమ్మశక్యం కాలేదని ఆయన అన్నారు. మంచి సేవలు అందించాలని రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు.
ఏపీ ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. మేకపాటి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ,వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.