Mekapati Goutham Reddy No More: గౌతమ్‌రెడ్డి మృతిపై అపోలో ఆస్పత్రి వైద్యులు కీలక ప్రకటన, ఆస్పత్రికి వచ్చినప్పుడే స్పందించని స్థితిలో ఏపీ ఐటీ మంత్రి, తీవ్రంగా శ్రమించినా ఫలితం లేదని ప్రకటన
Andhra Pradesh IT and Industries Minister Mekapati Goutham (Photo Credits: ANI)

Amaravati, Feb 21: ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) ఈ రోజు ఉదయం గుండెపోటుతో చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఇంట్లో గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే గౌతమ్‌ రెడ్డి తుదిశ్వాస విడిచారు. అపోలో అసుపత్రికి తీసుకొచ్చి చివరి ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.

మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంతో అధికారిక కార్యక్రమాలన్నీ రద్దుచేసుకొని హైదరాబాద్‌ బయల్దేరారు. మంత్రి మృతిపట్లు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, పలువురు పారిశ్రామికవేత్తలు ప్రగాఢ సంతాపం తెలిపారు

ఆయన మరణంపై అపోలో వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఉదయం 9.16 గంటలకు గౌతమ్‌రెడ్డి మృతిచెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. ‘గౌతమ్‌రెడ్డి ఇంటి దగ్గర కుప్పకూలారు. ఉదయం 7.45 గంటలకు గౌతమ్‌రెడ్డిని అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. స్పందించని స్థితిలో గౌతమ్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆయన ఆస్పత్రికి వచ్చే సమయానికి శ్వాస ఆడట్లేదు. అత్యవసరం విభాగంలో తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది’ అని వైద్యులు ప్రకటించారు.

హైదరాబాద్‌‌కు బయలు దేరిన ఏపీ సీఎం జగన్, మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపట్ల రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి, రేపు సీఎంను కలవడానికి గౌతమ్ అపాయింట్మెంట్..అంతలోనే పెనువిషాదం

కాగా.. ఉదయం 7:30 గంటలకు జిమ్‌కు వెళ్దామని సిద్ధమయ్యారని.. ఇంట్లో నుంచి బయటికి రాకముందే ఛాతిలో నొప్పిగా ఉందని సోఫాలోనే కూర్చుకున్నారని గౌతమ్ ఇంటి వాచ్‌మెన్ చెబుతున్నారు. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు, గన్‌మెన్‌లు అపోలో ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే ఆయన మృతిచెందారు. గౌతమ్‌రెడ్డికి భార్య శ్రీకీర్తి, కుమార్తె అనన్యరెడ్డి, కుమారుడు అర్జున్‌రెడ్డి ఉన్నారు.

గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. సంతాప సూచకంగా జాతీయపతాకాన్ని అవనతం చేయనున్నారు.

ఆయ‌న పార్థివ దేహాన్ని హైద‌రాబాద్‌ అపోలో ఆసుప‌త్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి గౌతమ్ రెడ్డి నివాసానికి త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న నివాసానికి ప‌లువురు నేత‌లు, బంధువులు, వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ హైద‌రాబాద్ చేరుకున్న వెంట‌నే అక్క‌డికి వెళ్లి ప‌రామ‌ర్శించ‌నున్నారు. అలాగే, ప‌లువురు ఏపీ నేత‌లు కూడా జూబ్లిహిల్స్ బ‌య‌లుదేర‌నున్నారు. కాగా, జూబ్లీహిల్స్‌లోని నివాసం వ‌ద్ద ఆయ‌న గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని కొద్దిసేపు ఉంచాక మ‌ళ్లీ ఏపీకి తీసుకెళ్ల‌నున్న‌ట్లు

తెలుస్తోంది.

గుండెపోటుతో మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత, ఇటీవలే కోవిడ్‌ బారిన పడి కోలుకున్న ఏపీ ఐటీశాఖ మంత్రి

ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి తన తండ్రి మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి అడుగు జాడల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తండ్రి రాజమోహన్‌రెడ్డి 1985లో ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. అనంతరం 1989, 2004, 2009, 2012, 2014లో ఒంగోలు, నర్సరావు పేట, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజమోహన్‌రెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో గౌతమ్‌రెడ్డి ఒక్కరే రాజకీయాల్లోకి వచ్చారు. గౌతమ్‌రెడ్డి బాబాయ్‌ చంద్రశేఖర్‌రెడ్డి 2019లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కూడా 2004, 2009, 2012ల్లో ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

గౌతమ్‌రెడ్డి ప్రస్థానం

► 1971 నవంబర్‌ 2న జననం.

► తల్లిదండ్రులు: మేకపాటి రాజమోహన్‌రెడ్డి- మణిమంజరి

► గౌతమ్‌ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లి.

► 1994-1997లో ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ నుంచి ఎంఎస్సీ పట్టా పొందారు.

► భార్య: మేకపాటి శ్రీకీర్తి

► పిల్లలు: ఒక కుమార్తె, ఒక కుమారుడు

► మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు.

► మొదటిసారి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైఎస్సార్ సీపీ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు.

► 2019 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి రెండోసారి గెలుపొందారు.

► ప్రస్తుతం సీఎం వైఎస్‌జగన్‌ కేబినెట్‌లో పరిశ్రమలు,ఐటీశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.