Amaravati, Feb 21: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) గుండె పోటుతో (Mekapati Goutham Reddy Dies) మృతి చెందారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు గౌతం రెడ్డి తుదిశ్వాస విడిచారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని (IT Minister Mekapati Goutham Reddy ) ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. దీంతో కుటంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు సమాచారం అందించారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
గౌతమ్ హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరికాసేపట్లో సీఎం జగన్ హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి ఇప్పటికే సీఎం నివాసానికి చేరుకున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారన్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారన్నారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గుండెపోటుతో మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత, ఇటీవలే కోవిడ్ బారిన పడి కోలుకున్న ఏపీ ఐటీశాఖ మంత్రి
గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం (Mekapati Goutham Reddy Passed Away) పట్ల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. ఓ మంచి స్నేహితుడు, అన్నను కోల్పోయానన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. మంత్రి మేకపాటి అకాల మరణం తనను కలచివేసిందని, మంచి రాజకీయ భవిష్యత్ ఉన్న నేత చిన్న వయసులోనే కన్ను మూశారని ఆవేదన చెందారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చివరి నిముషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడిన సహచరుడిని కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు. ఆయన కుటంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రార్థించారు.
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులన్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్దత కలిగిన నాయకులని కొనియాడారు. గౌతమ్ రెడ్డి తాత గారి సమయం నుంచి వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉందని చెప్పారు. ‘‘గౌతమ్ రెడ్డి నేనంటే ఎంతో అభిమానం చూపేవారు...అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం’’ అని ఆవేదన చెందారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య సానుభూతి తెలియజేశారు.
ఏపీ ఐటి రంగంలో అభివృద్ధి చేసిన మేకపాటి గౌతంరెడ్డి మరణం బాధాకరమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు.. అభివృద్ధి చెందుతున్న ఏపీకి తీరని లోటు అవంతి పేర్కొన్నారు. సహచర మంత్రిగా స్నేహితునిగా ఆయన మరణం ఊహించుకోలేక పోతున్నామన్నారు. రాష్ట్ర ఐ.టి.శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై నూజివీడు ఎమ్మెల్యే మేకాప్రతాప్ ప్రతాప్ అప్పారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాల్సిన గౌతమ్ రెడ్డిని మృత్వువు కబళించిందని ఆవేదన చెందారు. గౌతమ్ రెడ్డి పార్టీలతో సంబంధం లేకుండా అందిరితోను ఆప్యాయంగా కలిసిపోయేవారని, హుందాగా ప్రవర్తించేవారని అన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు అచ్చెన్నాయుడు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.
కాగా.. పరిశ్రమల శాఖ మంత్రి అయిన మేకపాటి వారం రోజులపాటు దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఏపీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి జగన్ ప్రభుత్వం దుబాయ్ ఎక్స్‌పో వేదికగా పలు కంపెనీలతో పరిశ్రమల శాఖ ఎంవోయూలు చేసుకుంది. వారం రోజులపాటు పర్యటన ముగిసిన అనంతరం ఆదివారం నాడు గౌతమ్ హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఈ కీలక భేటీలో దుబాయ్ పర్యటనకు సంబంధించి వివరాలన్నీ సీఎంకు వివరించాలని మేకపాటి అనుకున్నారు. భేటీ తర్వాత అమరావతిలోనే మేకపాటి ప్రెస్‌మీట్ కూడా నిర్వహించాలని భావించారు.. అయితే ఇంతలోనే పెనువిషాదం చోటుచేసుకుంది. దుబాయ్ పర్యటన ద్వారా ఏపీకి రూ. 5,015 కోట్ల పెట్టుబడులను గౌతమ్ తీసుకొచ్చారని తెలుస్తోంది.
కాగా.. సోమవారం ఉదయం గుండెనొప్పిగా ఉందంటూ గౌతమ్ తన భార్యకు చెప్పారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు గౌతమ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించింది. ఆయన ప్రాణాలు నిలపడానికి డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మరణానికి పోస్ట్ కొవిడ్ పరిణామాలే కారణమని తెలుస్తోంది. గౌతమ్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.