Night Curfew Extended in AP: ఏపీలో మరో వారంపాటు నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలు, కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్
Andhra Pradesh Partial curfew (Photo: PTI)

Amaravati, July 20: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం పాటు నైట్‌ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వగలిగామని సీఎం అన్నారు. థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.  సమీక్ష సమావేశంలో మంత్రి ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పాల్గొన్నారు.

ఏపీలో గడచిన 24 గంటల్లో 91,594 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,672 మందికి పాజిటివ్ (Corona in AP) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 504 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 372, ప్రకాశం జిల్లాలో 315, పశ్చిమ గోదావరి జిల్లాలో 292 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 21 పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,467 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 19,37,122 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,98,966 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 25,041 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,115కి పెరిగింది. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.