AP Government logo (Photo-Wikimedia Commons)

ఏపీ ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ (Andhra Pradesh DSC Notification) జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నేడు జీవో జారీ చేసింది. నాటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో 6,100 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆ నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో వచ్చింది. అయితే, నిరుద్యోగులను మభ్యపెట్టేందుకే హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారంటూ వైసీపీ ప్రభుత్వంపై నాడు విపక్షాలు ఎదురుదాడికి దిగాయి.

అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఎన్నికల హామీ ఇచ్చాయి. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇటీవలే 16,347 పోస్టులతో కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, వైసీపీ ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రాష్ట్ర విద్యాశాఖ రద్దు చేసింది.జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం.  మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం, ఏపీ మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఇవే..

మెగా డీఎస్సీతోపాటు (టెట్‌) నిర్వహించేందుకు చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించని వారు, ఈ టెట్‌ ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతోపాటు టెట్‌ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్, మెగా డీఎస్సీకి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

మొదట టెట్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డీఎస్సీ పరీక్ష ఉంటుంది. జులై 1న మెగా డీఎస్సీ, టెట్‌కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.