Amaravati, July 19: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) పోటీ చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. త్వరలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గ్రాడ్యుయేట్.... ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్.... ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.
మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, రెండు టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమై అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra MLC polls) పోటీ చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఆమోదించారు.
గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలను గతంలో ప్రాధాన్యతగా తీసుకోలేదని సీఎం జగన్ పేర్కొనగా.. ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వడం, ఉత్సాహవంతులకు అండగా నిలిచామని ఎమ్మెల్యేలు (YSRCP MLAs) గుర్తు చేశారు. అయితే శాసనమండలిలో ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలకు మద్దతు కోరినప్పుడు మన మద్దతుతో గెలిచిన వారు కూడా మొహం చాటేసిన పరిస్థితులను చూశామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రస్తావించారు.
గడప గడపకు మన ప్రభుత్వం, ఒక్కో ఎమ్మెల్యే ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం ఆదేశాలు
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పోటీ చేయడమే మంచిదని ఏకాభిప్రాయంతో సీఎం జగన్‌కు నివేదించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సూచనకు సీఎం జగన్ అంగీకరించారు. ముందుగా ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను తీసుకుని మూడు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ఖరారుచేశారు.
వైసీపీ నుంచి అభ్యర్థులు వీళ్లే..
ఉమ్మడి విశాఖ– విజయనగరం – శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ స్థానానికి అభ్యర్థిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఎస్.సుధాకర్‌ను ఖరారు చేశారు.
ఉమ్మడి ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానానికి గూడూరు నియోజకవర్గానికి చెందిన శ్యాంప్రసాద్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని సీఎం జగన్ ఖరారు చేశారు.
ఉమ్మడి కర్నూలు–కడప– అనంతపురం గ్రాడ్యుయేట్ స్థానానికి వెన్నపూస రవి పేరును ఖరారు చేశారు.
టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ, అభ్యర్థిపై తర్వాత నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ సూచించారు.