Andhra Pradesh Elections 2024: మే 13 ఓటింగ్ తర్వాతే సంక్షేమ పథకాల నిధులు విడుదల చేయండి, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
AP High Court (photo-Wikimedia Commons)

ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెనతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్ల నిధులను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల (అబయన్స్‌) చేసింది. అయితే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాత్రం సంక్షేమ పథకాల నిధులను పంపిణీ చేయడం గానీ, బదలాయించడం గానీ చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నిధుల పంపిణీకి సంబంధించి పత్రికలు, టీవీలు, రేడియో, ఇంటర్‌నెట్‌తో సహా ఏ ఇతర మాధ్యమం ద్వారా ఏ రకమైన ప్రచారం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నిధుల పంపిణీ విషయంలో ఎలాంటి ఆర్భాటాలు గానీ, సంబరాలు గానీ, రాజకీయ నాయకుల ప్రమేయం గానీ ఉండటానికి వీల్లేదని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఆరు నూరైనా నూరు ఆరైన నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే, కర్నూలు సభలో స్పష్టం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

ఈ విషయంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మీరడానికి వీల్లేదంది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... తదుపరి విచారణను జూన్‌ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ గురువారం రాత్రి 10.20 గంటల సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ చేయూత, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల కింద లబ్దిదారులకు పంపిణీ చేయాల్సిన నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయా సంక్షేమ పథకాల లబ్దిదారులైన రైతులు, మహిళలు, విద్యార్థులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆయా పథకాల కింద నిధులను తక్షణమే విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు.

ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్‌ కృష్ణమోహన్, నిధుల పంపిణీ ఎందుకు అత్యవసరమో వివరిస్తూ ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ వినతిపత్రంపై తగిన నిర్ణయం వెలువరించాలని ఎన్నికల సంఘాన్ని గతంలోనే ఆదేశింశారు. ఈ వ్యాజ్యాలు గురువారం మరోసారి విచారణకు రాగా, కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వినతిని పరిగణనలోకి తీసుకున్నామని, అందుకే పోలింగ్‌ పూర్తయ్యే వరకు నిధుల పంపిణీని ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని చెప్పారు. ఇప్పుడు నిధులు పంపిణీ చేస్తే అది ఓటర్లను ప్రభావితం చేసినట్లే అవుతుందని తెలిపారు.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆయా పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధులను ఇచ్చి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ‘‘ఇవేమీ కొత్త పథకాలు కావు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలు. వీటి ద్వారా లబ్దిదారులకు నిధులను పంపిణీ చేయడం ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలో భాగమే అవుతుంది తప్ప, ఓటర్లను ప్రభావితం చేయడం కిందకు రాదని వాదించారు.

చివరగా ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, పోలింగ్‌ అయ్యేంత వరకు నిధుల పంపిణీని ఆపడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే మిగిలిన వారి అవకాశాలు (లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌) దెబ్బతినకుండా ఉండేందుకే నిధుల పంపిణీని ఆపాలంటూ ఉత్తర్వులిచ్చామని తెలిపారు. ఎన్నికల నియమావళికి లోబడే ఈ ఉత్తర్వులిచ్చామని చెప్పారు. ఎన్నికల నియమావళి కొత్త పథకాలతో పాటు పాత పథకాలకు సైతం వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నిధుల పంపిణీ జరిగితే ఓటర్లను ప్రభావితం చేసినట్లే అవుతుందన్నారు. అందుకు ఆస్కారం లేకుండా చేసేందుకే నిధుల పంపిణీని నిలుపుదల చేశామన్నారు.