హైదరాబాద్, డిసెంబర్ 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనప్పటికీ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు నిర్వహించారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.
రోశయ్య మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు
రోశయ్య మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం..
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు రోశయ్య అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య గారి జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం. నీతి నిజాయితీ, నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావం, సిద్ధాంతాల ఆచరణలో రోశయ్య గారు పెట్టింది పేరు రోశయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న..