Amaravati, Sep 5: ఏపీలో పర్యాటక కార్యకలాపాల కోసం రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు (AP Tourism Guidelines) జారీ చేసింది. టూరిజం ట్రేడ్ రిజిస్ట్రేషన్, ఫెసిలిటేషన్ పేరిట మార్గదర్శకాలను పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రకటించారు. టూరిజం ఆపరేటర్ల రిజిస్ట్రేషన్ కోసం యంత్రాంగం లేకపోవటంతో గణాంకాల నమోదుకు వీలు కావటం లేదని నిర్దిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు (making registrations of tourism activities mandatory) జారీ చేసింది.
రాష్ట్రంలో పర్యాటకానికి సంబంధించి వివిధ గణాంకాల నమోదు, వివరాలు, సమాచార సేకరణకు ఈ రిజిస్ట్రేషన్లు అవసరం అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్నాటక తరహాలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. పర్యాటకులకు అందించే సేవల్లో ప్రమాణాలు పెంచటంతో పాటు అత్యుత్తమ పర్యాటక సేవలు అందించేలా చర్యలు ఉండాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలోని పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మార్కెటింగ్ వ్యవస్థకు రూపకల్పన చేయాలని సూచనలు చేసింది. రాష్ట్రంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు, పరిశ్రమతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు నెలకొల్పేలా కార్యాచరణ చేపట్టాలని పేర్కొంది. ఏపీలో సుదీర్ఘమైన తీరప్రాంతంతో పాటు నదులు, సుందరమైన ఇతర నీటి వనరులు, హిల్ స్టేషన్లు, అటవీ ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, బౌద్ధారామాలు, ఉన్నందున ఈ పర్యాటక సేవల్ని వ్యవస్థీకరించేలా కార్యాచరణ ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది
కాగా పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి అనువుగా నూతన పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపిన విషయం విదితమే. ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు తగిన స్థానం కల్పించాలన్నారు. రాజస్థాన్‌తో ధీటుగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని పేర్కొన్నారు. ఆతిథ్య రంగంలో సుప్రసిద్ధ కంపెనీల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 12 నుంచి 14 పర్యాటక ప్రాంతాల అభివృద్ది చేయాలని తెలిపారు. అరకులో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సెప్టెంబర్ మొదటివారం నుంచి పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతినిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పటికే తెలిపారు.