Amaravati, Oct 26: ఏపీ రాష్ట్రంలో మద్యం ప్రియులకు మరో షాక్ తగిలింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటాన్ని (Liquor Transportation in AP) నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్లు, లైసెన్స్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై ఏపీ ఎక్సైజ్ శాఖ (Prohibition and Excise Department) సోమవారం కొత్త జీవో (New GO) విడుదల చేసింది. గతంలో మాదిరిగా మూడు మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు కూడా ఇక నుంచి అనుమతి లేదు.
పర్మిట్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ద్వారా శిక్షార్హులు అవుతారు. ఈ మేరకు జీవో నెంబర్ 310ని ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. ఇక ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చింది. ప్రజల ఆరోగ్యంతో పాటు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏపీలో జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే
కాగా దశలవారీ మద్యం నియంత్రణకు కట్టుబడిన జగన్ సర్కారు కఠిన చర్యలు కొనసాగిస్తోంది. అందులో భాగంగా దశల వారీ మద్య నిషేధాన్ని సక్రమంగా అమలు చేస్తున్న తరుణంలో సరిహద్దుల్లో ఉన్న ఆరు రాష్ట్రాల్ల నుండి ఒక్కొక్కరు మూడు బాటిల్స్‌కు మించకుండా మద్యం తీసుకొని రావటాన్ని నిరోధిస్తూ ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 1968 ఎక్సైజు చట్టంలోని 34వ నిబంధనలను అనుసరించి ఇక మీదట ఏ ఇతర రాష్ట్రంనుంచి అయినా రాష్ట్రానికి మద్యాన్ని తరలించడానికి అవకాశం లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకు వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు (AP High Court) కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ఉన్నతన్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే అవకాశాన్ని హైకోర్టు కలిగించింది. అయితే తాజాగా ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారం ఇకపై ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అనుమతి లేదు.