Limited liquor in AP | Image used for representational purpose only | Photo- Pixabay

Amaravathi, September 25:  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి వద్ద ఉండే మద్యం నిల్వపై పరిమితులు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ చట్టాన్ని (New Excise Act) ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం రోజే విడుదల చేసింది, సెప్టెంబర్ 25, 2019 బుధవారం అంటే నేటి నుంచి ఈ కొత్త చట్టం అమలులోకి వస్తుంది అని పేర్కొంది. నేటి నుంచి రాష్ట్రంలో ఏ వ్యక్తి వద్ద అనుమతి లేదా లైసైన్స్ లేకుండా పరిమితికి మించి మద్యాన్ని కలిగి ఉండకూడదు అని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి. సాంబశివ రావు (D. Sambasiva Rao) ఉత్తర్వులు జారీచేశారు.

దీని ప్రకారం రాష్ట్రంలో ఏ వ్యక్తి దగ్గర కూడా 3 మద్యం సీసాలకు మించి కలిగి ఉండకూడదు. అవి లోకల్ గానీ, ఫారెన్ లిక్కర్ గానీ మరియు బాటిల్ సైజ్ ఎంత ఉన్నా కానీ 3కు మించి ఉండరాదు.

అలాగే బీర్ పై కూడా పరిమితి విధించారు. ఏ వ్యక్తి దగ్గర కూడా 650 మి.లీ పరిమాణం గల 6 సీసాల బీర్ కంటే ఎక్కువ మొత్తం కలిగి ఉండకూడదు.

ఇక మిథైలేట్ స్పిరిట్ (కల్లు) విషయానికి వస్తే, తాటికల్లు 2 బల్క్ లీటర్స్ వరకు మాత్రమే కలిగి ఉండవచ్చు. రిక్టిఫైడ్ స్పిరిట్ పూర్తిగా ఉండకూడదు అని ఎక్సైస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఎవరైన ఉల్లంఘిస్తే నూతన ఎక్సైస్ చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోబడతాయి.

ఏపీలో మద్యపానాన్ని నిషేధిస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికే ఏపిలో నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. ఈ నూతన మద్యం పాలసీ ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలోని 20% మద్యం దుకాణాలకు అనుమతులు నిలిపివేసి మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుండి 3,500 కు తగ్గించారు. ప్రభుత్వమే మద్యం షాపుల నిర్వహణ చేసేలా మద్యం కార్పోరేషన్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న మద్యం దుకాణాలన్ని ఇక మీదట కార్పోరేషన్ కిందకే రానున్నాయి. అక్టోబర్ 02 నుంచి ఈ విధానం అమలు కాబోతుంది.