
Amaravati, March 18: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారిక గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. దీనిని బట్టి రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ మొదలవుతుందా అనే ఆందోళన కలుగుతోంది. గతేడాది కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ప్రతిరోజూ 9 నుంచి 10 వేల వరకు కోవిడ్ కేసులు నమోదయ్యేవి. అయితే ఆ పరిస్థితుల నుండి ఏపి ప్రభుత్వం సమర్థవంతంగా రాష్ట్రంలో మహమ్మారిని కట్టడి చేయగలిగింది. ఇక అంతా మామూలు అవుతుందనుకుంటున్న తరుణంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 30- 40 మధ్య కేసులు వచ్చేవి, అయితే ఫిబ్రవరి మాసం మధ్య నుంచి కేసుల్లో పెరుగుదల మొదలైంది. నేడు ప్రతిరోజూ 2 వందలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,165 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 218 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 8,92,740 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,89,845గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో ఒక్క చిత్తూరు జిల్లా నుంచే అత్యధికంగా 63 కోవిడ్ కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి, గుంటూరు, కడప మరియు కృష్ణా జిల్లాల్లో జిల్లాకు సుమారుగా 20 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:

రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
గడిచిన ఒక్కరోజులో ఎలాంటి కోవిడ్ మరణం నమోదు అయినట్లు రికార్డుల్లో లేదు. ప్రస్తుతం ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7186గా ఉంది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 117 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,83,759 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1795 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
- ఇదిలా ఉంటే, విధినిర్వహణలో ఉంటూ కరోనా కారణంగా చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను అందించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమయ్యే మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఉపయోగించనున్నట్లు సమాచారం.