CM YS Jagan reviews on Clean AP program (Photo-Twitter/AP CMO)

Vijayawada, Octorber 31: ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఊహించని షాక్‌ తగిలింది. ఆయన వద్ద ఉన్న ఒక శాఖను ప్రభుత్వం తప్పించింది. ఆయన్ను కేవలం ఒక శాఖకే పరిమితం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్థిక శాఖ పరిధిలోకి వాణిజ్య పన్నుల శాఖ వచ్చినట్లయింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వద్ద ఉన్న వాణిజ్య పన్నుల శాఖను ఆయన నుంచి తప్పించింది. ఆ శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగిస్తూ జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. దీంతో ఎక్సైజ్ శాఖకే నారాయణ స్వామి పరిమితం కానున్నారు. వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని గతంలో ఏపీ ప్రభుత్వం భావించింది.

అప్పట్లో దీనిపై పలు అభ్యంతరాలు రావడంతో అది కార్యరూపం దాల్చలేదు. అప్పడు చేసిన ప్రతిపాదనను ఇప్పుడు అమలు చేయాలని సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆదివారం గెజిట్ విడుదల చేసింది సర్కార్‌. త్వరలో మరో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖను తప్పించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకే వాణిజ్య పన్నుల శాఖను డిప్యూటీ సీఎం నుంచి తప్పించినట్లు వైసీపీ వర్గాలు అనుకుంటున్నాయి.