రాష్ట్రంలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉదయం 7:30 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల నిర్వహణ (Half-day schools to begin from April 4) ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్ 27 నుంచి 10వ తరగతి పరీక్షలు, మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఒంటిపూట బడులపై ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రూప్ 1,2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 292 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 110 గ్రూప్-1.. 182 గ్రూప్-2 మొత్తం 292 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రూప్–1, 2 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పోస్టులు బాగా పెరిగాయి. గతంలో ఈ కేటగిరీల కింద కేవలం 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది.
దీంతో గ్రూప్–1లో 110, గ్రూప్–2లో 182 పోస్టులు.. మొత్తం కలిపి 292 పోస్టులు వచ్చాయి. అలాగే, గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీఓ, సీటీఓ, డీఎస్పీ, డీఎఫ్‌ఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి