Vijayawada, March 18: ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్లు (Doctors)కొత్త తలనొప్పి వచ్చి పడింది. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ నుంచి వచ్చిన కొత్త ఆదేశాలతో వారు ఇబ్బందుల్లో పడ్డారు. డాక్టర్లు ఆసుపత్రుల్లో ఉండటంలేదనే అనుమానం వచ్చిందో ఏమోగానీ..కమిషనర్ కంఠమనేని భాస్కర్ ( Katamaneni Bhaskar) ప్రభుత్వ డాక్టర్ల (Govt doctors)కు ఓ కొత్త ఆర్డర్ పాస్ (New command)చేశారు. బహుశా ఇటువంటి ఆదేశాలు వారి సర్వీసులో ఎప్పుడు విని ఉండరు. అందుకే షాక్ అవుతున్నారు. కలవర పడుతున్నారు. ఇంతకీ ప్రభుత్వ డాక్టర్లను అంతగా కలవరానికి గురి చేస్తున్న కమిషనర్ కంఠమనేనిగారి ఆదేశాలేమంటే..డాక్టర్లు ఆసుపత్రిలోనే ఉన్నట్లుగా ప్రతీ గంటకు ఒకసారి సెల్పీ తీసి సంబంధిత వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని..!! దీంతో డాక్టర్లు తెగ హైరానా పడిపోతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న డాక్టర్లు అందరు అటెండెన్స్ కోసం బయోమెట్రిక్ (Biometric)కచ్చితంగా వాడాలి. వాళ్లు ఆస్పత్రికి రాగానే ఎంట్రీ అండ్ ఎక్సిట్ (entry and exit)అయ్యే సమయంలో బయోమెట్రిక్ వాడాలి.
ఇప్పుడు అంతేకాదు. డాక్టర్లు ఆస్పత్రికి వచ్చారనే విషయం నిర్ధారణ అక్కడితో సరికాదు. ఇప్పుడు కొత్తగా సెల్ఫీ (Selfie) నిర్ధారణ కూడా ఉండాల్సినంటూ ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ కమిషర్ కంఠమనేని భాస్కర్..డాక్టర్లు ఆస్పత్రికి వచ్చాక అందరూ ఆస్పత్రిలోనే ఉన్నాం అని చెప్పేలా గంటగంటకీ ఓ సెల్ఫీ సంబంధిత వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చెయ్యాలి.ఈ ఆదేశాలే ఇప్పుడు ఏపీలోని డాక్టర్లకు ఏమాత్రం మింగుడుపడడంలేదు.
తాజాగా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు కమిషనర్ కంఠమనేని భాస్కర్. డాక్టర్లు అందుబాటులో ఉండడంలేదని, రోగులకు సరిగా అందడంలేదని చాలా ఫిర్యాదులు ఆయన దృష్టికి వచ్చాయి. దీంతో సెల్ఫీ నిర్దారణకు ఆదేశించారు. ప్రతీఒక్కరు బయోమెట్రిక్ వాడాలి. దాంతోపాటు గంటగంటకూ సెల్ఫీ అప్‌లోడ్ చెయ్యాలి. ఆ సెల్ఫీ కూడా ఎక్కడో తీసిందికాదు.. ఆస్పత్రి ప్రాంగణం, తమ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్లుగా చూపించేదిగా ఉండాలి అని సుస్పష్టం చేశారు. ఈ ఆదేశాలతో ఒక్కసారిగా డాక్టర్లలో కలవరం మొదలైంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండడంలేదని, వైద్యం అందండలేదని వస్తున్న ఫిర్యాదులకు చెక్ పెట్టాలని ఉద్ధేశ్యంతో కమిషనర్ భాస్కర్, సెల్ఫీల అప్‌లోడ్ నిర్ణయాన్ని తీసుకున్నారు.