
ప్రముఖ ఆధ్యాత్మక వేత్త, అవధాని గరికపాటి నరసింహారావుకు పద్మ పురస్కారం లభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం అత్యున్నత అవార్డు పద్మశ్రీకి ఆయనను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో 1958 సెప్టెంబర్ 14న పుట్టారు. ఎంఏ, ఎంఫిల్, పీహెచ్ డి చేశారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిగా 30 ఏళ్ల పాటు పని చేశారు. ప్రవృత్తి రీత్యా అవధానిగా పేరొందారు. క్లిష్ట సమస్యలను అత్యంత సులభమైన రీతిలో అర్థమయ్యేలా చెబుతూ వస్తున్నారు. ఒక రకంగా తెలుగు వారికి ఆహ్లాదాన్ని, విజ్ఞానాన్ని పంచుతున్నారు. కుటుంబం, సంప్రదాయం, సంస్కృతి, జీవితం, విద్య, పెద్దల పట్ల ఎలా ఉండాలి, భార్య భర్తల మధ్య బంధం ఎలా ఉంటే బావుంటుందో, తల్లిదండ్రుల పట్ల ఎలాంటి దయ కలిగి ఉండాలనే దానిపై ఆయన నిత్యం చెబుతూ వస్తున్నారు.
ఒక రకంగా ఆయనను మార్గదర్శకుడిగా పిలవడంలో తప్పులేదు. గరికపాటి అవధాని మాత్రమే కాదు మంచి రచయిత, అద్భుతమైన వక్త. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాలలో సైతం అవధానాలు నిర్వహించారు. మహా సహస్రావధానం నిర్వహించడంలో దిట్ట. పలు ప్రసార మాధ్యమాలలో నిత్యం బోధనలు చేస్తూ అలరిస్తూ వస్తున్నారు గరికపాటి. పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగించారు. గరికపాటికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయనకు శ్రీశ్రీ అన్నా గురజాడ అప్పారావు అన్నా వల్లమాలిన అభిమానం. అందుకే ఆయన తనయులకు శ్రీశ్రీ, గురజాడ ని పేర్లు పెట్టుకున్నారు. గరికపాటి ఇప్పటి దాకా 14కు పైగా పుస్తకాలు రాశారు వివిధ అంశాలపై. ఇప్పటి దాకా 275 అష్టావధానాలు చేపట్టారు.