ap-govt-to-implement-zero-fir-in-police-stations (Photo-Facebook)

Amaravathi, December 3: ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ (Andhra Pradesh Police Department) సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదులకు సంబంధించి.. "0" (జీరో) ఎఫ్‌ఐఆర్‌ (Zero FIR) అమలు చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ( DGP Gautam Sawang) ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఇప్పటికే జిల్లా ఎస్పీలు కసరత్తులు ప్రారంభించారు. ‘జీరో’ ఎఫ్‌ఐఆర్‌ విధానం ప్రస్తుతం ఢిల్లీ, ముంబై లాంటి రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఈ రూల్ ప్రకారం దగ్గర్లో ఉన్న ఏ స్టేషన్లోనైనా కంప్లైంట్ ఫైల్ చెయ్యెచ్చు.

దానిపై తక్షణ విచారణ జరిపిన అనంతరం, ఆ ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ చెయ్యాల్సి ఉంటుంది. తమ పరిధి కాదంటూ పోలీసులు బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి జీరో ఎఫ్‌ఐఆర్‌లో అవకాశముండదు. జీరో ఎఫ్‌ఐఆర్‌ పేరిట బాధితులు ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేస్తే దానిని స్వీకరించి విచారణ జరిపి సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్‌కు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి ఉంటుంది.

మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ ట్రైనర్స్ వర్క్ షాప్‌ను ప్రారంభోత్సవంలోనే డీజీపీ గౌతం సవాంగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామ సచివాలయాలకు అందే ఫిర్యాదులు పోలీసులకు అందేలా అనుసంధానం చేస్తున్నామని, జీరో ఎఫ్‌ఐఆర్‌ను కచ్చితంగా అమలుచేయాలని అన్ని జిల్లాల ఏస్పీలకు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామని ఆయన వెల్లడించారు.

దిశ(justice for Disha)పై దారుణ హత్యాచారం ఘటనలో పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. తమ పరిధిలోకి రాదంటూ పలు పోలీస్ స్టేషన్లకు తమను తిప్పారంటూ దిశ తల్లిదండ్రులు వాపోయిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్గత విచారణ చేసిన పోలీసు శాఖ అందుకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసింది. దీంతో ఏపీలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.