Vjy, Dec 19: ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు.. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా.. ఇలా మాఫియాలు చేస్తున్నారన్నారని వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి సమయంలోనే మనం గొంతు విప్పాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశమని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదు. ప్రతి కుటుంబానికి మనం మంచి చేశాం. కానీ, చంద్రబాబు అంతకంటే ఎక్కడు చేస్తానంటూ, ప్రతీ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ ఒక హామీ ఇచ్చాడు. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలామంది నాతో అన్నారు. గడచిన ఐదేళ్లలో చరిత్రలో ఎప్పుడూ చూడని మార్పులు మనం తీసుకువచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకువచ్చాం, ప్రతీ హామీని తూచా తప్పకుండా అమలు చేశామన్నారు.
కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినా, ప్రభుత్వ ఆదాయాలు తగ్గినా, ఖర్చు పెరిగినా, సాకులు చూపకుండా, కారణాలు చెప్పకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశాం. బడ్జెట్లోనే సంక్షేమ క్యాలెండర్ ప్రకటించాం. క్యాలెండర్ ప్రకారం ప్రతీ పథకాన్ని అమలు చేశాం. దేశ చరిత్రలో అమలు చేసిన పార్టీ ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే. చంద్రబాబు మాటలను పదిశాతం ప్రజలు నమ్మారు, నమ్మించగలిగారు. అందుకనే పరాజయం పాలయ్యాం. జగన్ చేశాడు కదా.. చంద్రబాబు కూడా చేస్తాడేమోనని కొంతమంది అనుకున్నారు. ఆరు నెలలు కూడా గడవకముందే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు మన అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.
YS Jagan Press Meet
చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని లేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పాను. దాన్ని ఇవాళ చంద్రబాబు నిజం చేస్తున్నారు. జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావు పోయిందీ, బిర్యానీ పోయిందీ. ఉన్న పథకాలు పోయాయి.. ఇస్తానన్న పథకాలు రావడంలేదు. ఇప్పుడు ప్రజలపై బాదుడే బాదుడు మొదలైంది. ఆరు నెలల్లోనే ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో భారం వేశాడు.
రైతులకు మనం ఏడాదికి ఇచ్చే రూ.13,500 ఎగిరిపోయింది.. చంద్రబాబు ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఉచిత పంటల బీమాను ఎత్తివేశారు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పంటలకు ఎక్కడా గిట్టుబాటు ధరలు దొరకడం లేదు. ధాన్యం కొనుగోలు సమయంలోనే రైతులకు ఎఫ్‌టీవో ఇచ్చే వాళ్లం. రూ.300-400 తక్కువ రేటుకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనిపై ఇది వరకే మనం కార్యక్రమం చేశాం. ఈనెల 27న కరెంటు ఛార్జీల మీద నిరసన వ్యక్తం చేస్తూ మరో కార్యక్రమం చేస్తున్నాం. పెరిగిన బిల్లులు చూపిస్తూ వాటిని కాల్చివేస్తున్న పరిస్థితులు చేస్తున్నాం. కరెంటు ఛార్జీల పెంపు మీద నిరసన కార్యక్రమాన్ని నియోజకవర్గాల స్థాయిలో చేపడుతున్నాం. మళ్లీ జనవరి 2న ఫీజు రియింబర్స్‌మెంట్, వసతి దీవెనమీద నిరసనలకు ప్లాన్ చేశాం.
మన ప్రభుత్వ హయాంలో ప్రతీ త్రైమాసికానికి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పంపాం. జనవరి ఒకటో తేదీ నాటికి నాలుగు త్రైమాసికాలుగా ఫీజులు చెల్లించడం లేదు. అలాగే వసతి దీవెన బిల్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా రూ.3,900 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చదువులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. డబ్బులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. వీరికి అండగా జనవరి 3న జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమం చేస్తుంది:
విజన్ 2047 పేరిట మరో డ్రామా జరుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఎల్లో మీడియా వారి మేనిఫెస్టోపై ఊదరగొట్టారు. ఈ మేనిఫెస్టోకు దిక్కులేదు, ఇప్పుడు 2047కు అర్థం ఏముంటుంది?. ఇప్పుడు చంద్రబాబు వయస్సు దాదాపు 80 ఏళ్లు. ఒక మనిషిని అభివృద్ధి బాటలో పట్టించడమే విజన్ అని నేను నమ్ముతాను. ఇప్పటి పిల్లాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలన్నదానిపై మనం ఆలోచనలు చేస్తే అది విజన్ అవుతుంది. అలాంటి ఆలోచనలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసింది. ప్రైవేటు స్కూల్స్.. గవర్నమెంటు స్కూల్స్‌తో పోటీపడే పరిస్థితిని తీసుకు వచ్చాం. ఉన్నత విద్యలో విద్యార్థులు అత్యాధునిక కోర్సులు చదువుకునేలా ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం కల్పించాం.