Nellore, Feb 2: నెల్లూరు జిల్లాలో వైసీపీలో ఎమ్మెల్యేల అంశం కలకలం రేపుతోంది. నేరుగా పార్టీ అధిష్ఠానంపై ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి (Anam Ram narayana Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు వెంకటగిరి నియోజకర్గంలో ఆనంకు వ్యతిరేకంగా పార్టీ అధిష్ఠానం నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని (nedurumalli ramkumar) ప్రోత్సహిస్తోంది.ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డిపై నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగం గురించి ఆనం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా, నేదురుమల్లి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వెంకటగిరి నియోజకవర్గంలో మేము పనిచేస్తే గెలిచావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దయతలచి సీటు ఇచ్చారు. గెలిచిన మొదటి ఏడాది నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. తప్పుడు ఆరోపణలు ప్రజల మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందని ఇప్పుడు చెబుతున్నారు. నీ తప్పులనీ బయటకు వస్తున్నాయి. కాంట్రాక్ట్‌ల విషయాలు కూడా బహిర్గతమవుతున్నాయి.
అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం రామనారాయణ రెడ్డి. వయసు పైబడటంతో ఆనం బుద్ది మందగించింది. వెంకటగిరి నక్సల్ ప్రాంతమని ఆనం మాట్లాడుతున్నారు. ఆనంను సొంత తమ్ముడే వ్యతిరేకిస్తున్నారు. ముందునుంచే శ్రీధర్ రెడ్డి, ఆనంలు టీడీపీతో టచ్‌లో ఉన్నారు. ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.