
Tirupati, Feb 4: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ గా అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 మంది కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 47 మంది ఉన్నారు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 50 మంది సభ్యులకు గాను మునికృష్ణకు 26 మంది ఓటు వేశారు. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది మద్దతుగా నిలిచారు. దీంతో మునికృష్ణ గెలిచినట్టు (Tirupati Deputy Mayor Election Result) అధికారులు ప్రకటించారు.
మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్‌లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ (Tirupati Deputy Mayor) ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది.
మొత్తంగా 50 మంది సభ్యులకుగాను సగం మంది (25) హాజరు కావాల్సి ఉండగా.. ఎమ్మెల్యే ఆరణితో కలిసి 22 మందే రావడంతో కోరం లేదని సోమవారం అనివార్యంగా ఎన్నికను వాయిదా వేశారు. ఇవాళ జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికకు 26మంది కావాల్సి ఉండగా.. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ఆ పార్టీ కార్పొరేటర్లతో హాజరై వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డిని బలపర్చారు. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మునికృష్ణ కు 26 ఓట్లు రావడంతో డిప్యూటీ మేయర్ గా మునికృష్ణ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇదిలాఉంటే.. ఉద్రిక్తల మధ్య డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎన్నికల కేంద్రం వద్ద అదనపు భద్రతను కల్పించారు. తిరుపతిలో 144 సెక్షన్ ను అమలు చేశారు.