Vjy, Feb 4: వైఎస్ జగన్ నేడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ.. ఈసారి జగన్ 2.0ని (Jagan 2.0) చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుంది’’ అంటూ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తాం’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విజయవాడ కార్పొరేషన్‌లో 64 స్థానాలుంటే 49 స్థానాలు అప్పట్లో మనం గెలిచాం. తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్ధానాలు 14, కమ్యూనిస్టులు 1 గెలిచారు.
వాళ్లకు కేవలం 14 స్థానాలున్నా.. ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల ప్రలోభాలపెట్టో, భయపెట్టో 13 మందిని తీసుకున్నారు. అయినా ఇంకా 38 మంది నిటారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఏ కార్పొరేషన్, మున్సిపాల్టీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏవి తీసుకున్నా.. ఎన్నికలు అయిపోయిన మూడేళ్ల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి రిజల్ట్‌తో కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే క్వీన్ స్లీప్ చేయగలిగింది’’ అని వైఎస్ జగన్ చెప్పారు.
ఎన్నికల వేళప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశాం. ప్రతినెలా ఏ పథకం అమలు చేస్తామో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేసి.. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం, ఎక్కడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమేనని జగన్ తెలిపారు.
ఇవాళ ఎన్నికలు పూర్తయి దాదాపు 9 నెలలు కావస్తోంది. మనం ఓడిపోయినా కూడా ఈ రోజుకు కూడా మనం గర్వంగా తలెత్తుకుని ప్రజల దగ్గరకు పోగలుగుతాం. వాళ్ల చిరునవ్వుల మధ్య నిలబడి వాళ్ల సమస్యలను వినగలుగుతాం. వాళ్లతో మమేకం కాగలుతాం. కారణం ఏ రోజూ మనం వాళ్లను మోసం చేయలేదు. వాళ్లకు ఏరోజూ అబద్దాలు చెప్పలేదు. ఏదైతే చెప్పామో అది చేసి చూపించిన తర్వాత వాళ్లకు ఓట్లు అడిగాం కాబట్టి ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు.
కానీ. .ఎన్నికలు అయిన 9 నెలలు తిరక్కముందే కూటమికి చెందిన ఎమ్మెల్యే దగ్గర నుంచి.. కార్యకర్త వరకు గడప, గడప అంటూ ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. కారణం ఏ గడపకు వెళ్లినా ఎన్నికలు ముందు వీళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లు, సూపర్ సెవెన్‌లు ప్రజలు వీళ్లకు చూపించి.. ఆ ఇంట్లో నుంచి ఇద్దరున్నా ముగ్గురు పిల్లలున్నా ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను నా రూ.రూ15వేలు ఏమైందని ప్రశ్నిస్తారు. ఆ పిల్లల తల్లులు కూడా నా రూ.18 వేలు ఏమైందని ప్రశ్నిస్తారు. 50 ఏళ్లు నిండిన ఆ తల్లుల అత్తలు, అమ్మలు నా రూ.45వేలు ఏమైందని ప్రశ్నిస్తారు.
అదే ఇంట్లో 20 ఏళ్ల పిల్లవాడు నాకు నెల, నెలా రూ.3వేలు ఇస్తానన్నావ్.. నా రూ.36 వేలు ఏమైందని అడుగుతాడు. గ్రామీణ ప్రాంతాలకు వెళితే కండువా వేసుకున్న రైతులు నా రూ.20 వేలు సంగతేంటని నిలదీస్తారు. ఇలా ఏ ఇంటికి వెళ్లినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నికలప్పుడు ఆ రోజు మేం చేయకపోతే నా కాలర్ పట్టుకొండని అన్నాడు. కానీ ఈ రోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారని భయపడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు.
ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఇవాళ సంపద సృష్టించడం ఎట్లో నా చెవిలో చెబితే నేను తెలుసుకుంటానంటున్నాడు. ఇదే మాటను ఆ రోజే నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని, చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడం అని చెప్పాను. మన మేనిఫెస్టోను, వాళ్ల హామీలను చూపిస్తూ.. చంద్రబాబు చెప్పినవి అమలు చేయడం సాధ్యం కాదని చెప్పాను. రాష్ట్ర బడ్జెట్ ఇది.. మనం చేస్తున్న కార్యక్రమాలు ఇవి.. వీటికింత ఖర్చవుతుంది. మరో వైపు చంద్రబాబు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలు చెబుతున్నాడని మండిపడ్డారు.
ఓడిపోయాం ఫర్వాలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాం అదీ ఫర్వాలేదు. మరలా అదే రోజుకు వెనక్కి తిరిగి వెళితే... ఇదే విధంగానే మరలా చెబుతాం.. కారణం రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అదే అర్ధం. జమిలి అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అదే విలువలు, విశ్వసనీయత అన్న పదం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరలా అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
రాజకీయాలలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి. ఆ కష్టాలలో ఉన్నప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటామో అన్నదే మనల్ని నాయకుల్ని చేస్తుంది. కష్టం వచ్చినా మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. ఒక్కసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకుతెచ్చుకొండి.
నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నా మీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులే. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగకేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏం జరిగింది. బయటకు వచ్చి, ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగకేసులు పెడతారు. జైల్లో పెడతారు. అయినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. మీకు మంచి చేసిన వారినీ, చెడు చేసిన వారినీ ఇద్దరినీ గుర్తుపెట్టుకొండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది. మరో ముప్పై సంవత్సరాలు ఏలుతాం. ఒక్కటే గుర్తు పెట్టుకొండి. ఈసారి జగనన్న 2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా.. ఇది కచ్చితంగా చెబుతున్నాను.
జగనన్న 1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయిండవచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకువచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను. వారి కోసమే నా టైం కేటాయించాను, ప్రజల కోసమే అడుగులు వేశాను. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. వారి అవస్ధలను చూశాను. వీళ్ల కోసం మీ జగన్ అండగా ఉంటాడని తెలిపారు.