Heavy Rains in AP: ఏపీలో దంచికొడుతున్న వానలు, కృష్ణాజిల్లాలోని పుట్రేలో అత్యధికంగా 9.6 సెం.మీల వర్షపాతం నమోదు, రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Representational Image | (Photo Credits: PTI)

Amaravati, August 17: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు (Heavy Rains in AP) కురుస్తున్నాయి. ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గత 24 గంటలలో ఏపీలో నమోదైన వర్షపాతం.. కృష్ణాజిల్లాలోని పుట్రేలో అత్యధికంగా 9.6 సెం.మీలు, పశ్చిమగోదావరి జిల్లాలోని పోతవరంలో 8.4 సెం.మీలు, విజయనగరం జిల్లాలో జియ్యమ్మ వలసలో 7.7 సెం.మీల వర్షం నమోదైంది. విశాఖలోని గొలుగొండలో 6 సెం.మీల వర్షపాతం నమోదైంది.

శ్రీకాకుళం జిల్లాలో 11.1 మి.మిలు, విజయ నగరం 5.9 మి.మీలు, విశాఖలో 6.8 మి.మీల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 8.1, కృష్ణా జిల్లాలో 4.9మి.మీల వర్షపాతం నమోదవ్వగా.. చిత్తూరులో 4.1, అనంతపురంలో 4.మి.మీల వర్షం నమోదైంది. భారీ వర్షాల ప్రభావంతో.. కృష్ణాజిల్లాలోని తిరువూరు మండలంలోని చౌటపల్లి-కొత్తూరు గ్రామాల మధ్య ఎదుళ్ల వాగుపై వరద బీభత్సంగా ప్రవహిస్తుంది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి. అదే విధంగా, గంపలగూడెం మండలం తోటమూల-వినగడప కట్టలేరు వాగుపై వరద ఉధృతి కొనసాగుతుంది. సమీప గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

గుడ్ న్యూస్..ఏపీలో 10 జిల్లాల్లో అత్యంత తక్కువగా కరోనా పాజిటివిటీ రేటు, తాజాగా 909 మందికి కోవిడ్, 1,543 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి, రాష్ట్రంలో ప్రస్తుతం 17,218 యాక్టివ్ కేసులు

ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వెంబడి వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం (low pressure in the west-central Bay of Bengal ) ఏర్పడనుంది. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40–50 కీలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని.. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.

కోస్తాంధ్రలో విస్తారంగా.. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తరాంధ్రలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాబోయే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సోమవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా వేపాడులో అత్యధికంగా 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

తెలంగాణలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని, రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసింది.