AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ విశ్వరూపం చూపిస్తున్న కరోనా, గత 24 గంటల్లో 700 దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో 3,469కి పెరిగిన ఆక్టివ్ కేసులు
Coronavirus Cases in AP (Photo Credits: PTI)

Amaravati, March 25: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మళ్లీ గత విశ్వరూపం చూపిస్తుంది. రోజూవారీ నమోదయ్యే కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో ఒక్కోరోజు పాజిటివ్ కేసుల సంఖ్య వంద దాటుతోంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఏపి ప్రభుత్వం ఇంతకాలంగా కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యలు మళ్లీ మొదటికి వస్తాయి. అదే జరిగితే మళ్లీ లాక్డౌన్ విధించాల్సి రావడం తప్ప, మరో గత్యంతరం ఉండదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.

ఏపిలో మళ్లీ కోవిడ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ వ్యాప్తిని అరికట్టాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సమిష్టిగా పోరాడితేనే కరోనా కట్టడి చేయగలం అని ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇందుకోసం ప్రజలు మాస్కులు వేసుకోవడం, చేతులు శుభ్రపరుచుకోవడం తదితర కోవిడ్ నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని ప్రభుత్వం కోరుతోంది.

ఇక రాష్ట్రంలో కోవిడ్ కేసుల విషయానికి వస్తే... గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,196 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 758 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 8,95,879 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,92,984గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 175 కోవిడ్ కేసులు నమోదు కాగా, గుంటూరు నుంచి 127, విశాఖపట్నం నుంచి 98, మరియు కృష్ణా నుంచి 80 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 4 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7,201కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 231 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,85,209 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 3,469 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.