
Amaravati, Nov 1: రేపటి నుంచి రాష్ట్రంలో బడులు తెరుచుకోనున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటగా 9,10 విద్యార్థులకు తరగతులు (Andhra Pradesh Schools) ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 23 నుంచి 6, 7, 8 తరగతులకు క్లాస్‌లు ప్రారంభమవుతాయని (Andhra Pradesh schools to reopen) వెల్లడించారు. దశలవారీగా అన్ని తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం స్కూల్స్ నిర్వహించనున్నామని చెప్పారు.
తగ్గించిన సిలబస్‌తో విద్యా సంవత్సరం పూర్తిచేస్తామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం ఒక పూట మాత్రమే తరగతులు నిర్వహిస్తామని, మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు ఇళ్లకు పంపిస్తామని మంత్రి సురేష్ పేర్కొన్నారు.
డిగ్రీ, పీజీ తదితర కోర్సుల కాలేజీల పునఃప్రారంభానికి సంబంధించి ఉన్నత విద్యాశాఖ శుక్రవారం రాత్రి అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. నవంబర్ 2 నుంచి సరి, బేసి సంఖ్యల రోజుల్లో తరగతులు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో కూడా వీటిని కొనసాగించేలా మార్గదర్శకాలిచ్చారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ ఫస్టియర్ తరగతులను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నారు.
వారంలో ఆరు రోజులు పనిదినాలుంటాయి. ఏదైనా కారణాల వల్ల పని దినాన్ని కోల్పోవాల్సి వస్తే రెండో శనివారం, ఇతర సెలవు దినాల్లో (నేషనల్ హాలిడేలు, ముఖ్యమైన పండుగ దినాలు మినహా) భర్తీ చేయాలి. ఫస్టియర్ పీజీ ప్రోగ్రాంల షెడ్యూల్‌ను వేరుగా విడుదల చేస్తారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి కాలేజీలను నిర్వహించాల్సి ఉంటుంది.