Amaravati, April 19: అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాబోయే భర్త గొంతును ఓ యువతి కత్తితో (Young Woman stabbed Her Fianc) కోసేసింది. బుచ్చెయ్యపేట మండలం అమరపురి వద్ద ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బుచ్చెయ్యపేట ఎస్‌ఐ బి.రామకృష్ణ కథనం ప్రకారం.. మాడుగుల మండలం ఘాటీరోడ్డుకు చెందిన అద్దేపల్లి రామునాయుడుకు రావికమతానికి చెందిన వియ్యపు పుష్పతో వివాహం చేయడానికి ఇరు కుటుంబాల వారు ఆరు నెలల కిందట నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీన వీరి వివాహానికి నిశ్చితార్థం చేశారు. మే 20న వివాహం చేయడానికి ముహూర్తం పెట్టారు. ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు చేసుకుంటున్నారు.
సోమవారం ఉదయం అమ్మాయి ఫోన్ చేయడంతో రామునాయుడు ఘాటీరోడ్డు నుంచి రావికమతం వెళ్లాడు. అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పి ఇద్దరూ బుచ్చెయ్యపేట మండలం కొమళ్లపూడి దగ్గర ఉన్న అమరపురి బాబా గుడి వద్దకు బైక్‌పై వెళ్లారు. మీకు బహుమతి ఇస్తానని, కళ్లు మూసుకోమని యువతి కోరినట్టు బాధితుడు వాంగ్మూలంలో చెప్పాడు. తన చున్నీతో కళ్లకు గంతలు కట్టిందని, అంతలోనే కత్తితో గొంతుపై గాయపరచిందని ఆతను పేర్కొన్నారు.
రక్తంతో రామునాయుడు షర్టు తడిచిపోవడంతో..రక్తం కారకుండా పుష్ప చున్నీ గొంతుకు కట్టుకుని ఆమెను బైక్ ఎక్కించుకుని రామునాయుడు రావికమతం ఆస్పత్రికి బయలుదేరాడు. మార్గంమధ్యలో పరిస్ధితి విషమంగా ఉండటంతో బైక్‌ను రోడ్డు పక్కన ఆపి సొమ్మసిల్లిపోయాడు. అక్కడ ఉన్న యువకుడు రామునాయుడు పరిస్ధితిని చూసి రావికమతం ఆస్పత్రిలో ఇద్దరినీ విడిచి వెళ్లిపోయాడు. వైద్యుల సలహా మేరకు పరిస్ధితి విషమంగా ఉండటంతో రామునాయుడును అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తం అవడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని రామునాయుడు కుటుంబ సభ్యులకు అక్కడ వైద్యులు సూచించారు. అయితే కుటుంబ సభ్యులు అతనిని అనకాపల్లిలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
సంఘటన గురించి తెలుసుకున్న బుచ్చెయ్యపేట ఎస్‌ఐ అనకాపల్లి ఆస్పత్రికి వెళ్లి విషమ పరిస్ధితిలో ఉన్న రామునాయుడు నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తనకు కాబోయే భార్యే కత్తితో తన గొంతు కోసిందని, నీవంటే నాకు ఇష్టం లేదని చెప్పిందని రామునాయుడు వాంగ్మూలం ఇచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. సోమవారం వీరు ఎక్కడెక్కడికి తిరిగారు.. గొంతు కోసిన తరవాత వీళ్లని ఆస్పత్రికి తీసుకొచ్చిన యువకుడెవరు.. అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులేమంటున్నారు.. తదితర విషయాలపై బుచ్చెయ్యపేట ఎస్‌ఐ విచారణ చేస్తున్నారు. రామునాయుడు పరిస్థితి కాస్త మెరుగైందని, ప్రాణాపాయం లేదని అనకాపల్లి ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు చెప్పారు. హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న తమ కుమారుడికి ఈ గతి పట్టిందేమిటని తల్లిదండ్రులు రమణ, గంగమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు.