Amaravati, May 27: రెండో రోజు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం పాత గాజువాక వైఎస్సార్ విగ్రహం నుంచి బస్సు యాత్ర (Samajika Nyaya Bheri Bus Yatra) ప్రారంభమైంది. ఈ బస్సు యాత్ర ప్రారంభానికి ముందు గాజువాకలో ఏర్పాటు చేసిన సభా వేదికపై హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘‘ఆంధ‍్రప్రదేశ్ ముఖ‍్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70 శాతం పదవులు ఇచ్చారు. దేశంలో ఎక్కడా కూడా ఇలా పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. జగనన్న తప్ప గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంత గౌరవం, రాజ్యాధికారం ఇచ్చిన వారు లేరు’’ అని అన్నారు.
అంతకుముందు మంత్రి వనిత మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. అమలాపురం ఘటనలో టీడీపీ, జనసేన పాత్ర స్పష్టమైంది. అరెస్ట్ అయిన వారిలో ఈ రెండు పార్టీల వారే ఉన్నారు. ఆధారాలు, ఫొటోలు, వీడియోలతో ఆధారంగా వారిని అరెస్ట్ చేశాము. చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారు. నేను వీళ్ళ పాత్ర ఉందని ముందే చెప్పాను. బస్సు యాత్రకి స్పందన లేదనడం చంద్రబాబు అవివేకం. ప్రతీ చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సీఎం జగన్ పాలనను ప్రశంసిస్తున్నారు’’ అని తెలిపారు.
అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో సంతృప్తికర పాలన కొనసాగుతోంది. మళ్లీ సీఎం జగన్‌ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. దళితులను అవమానించిన వ్యక్తి చంద‍్రబాబు. మహానాడు కాదు.. అది వల్లకాడు. మేనిఫెస్టోను తుంగలో తొక్కిన వ్యక్తి, చరిత్ర హీనుడు చంద్రబాబు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి’’ అని అన్నారు.
‘సామాజిక న్యాయం అందుతుంటే కొన్ని ప్రతి పక్ష పార్టీ లు అల్లర్లు సృష్టిస్తున్నారు. దళిత మంత్రి ఇంటికి నిప్పు పెట్టడం అమానుషం. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం సమర్థిస్తున్నారా లేదా ప్రతి పక్షాలు సమాధానం ఇవ్వాలి. జగనన్న పాలనలో నేరుగా లబ్ధిదారులకు మేలు జరుగుతుంది..రాజకీయ దళారీలు లేరు. మూడేళ్లుగా మేలు జరుగుతుంటే జన్మ భూమి కమిటీలు భరించలేక పోతున్నాయి. మాట ప్రకారం పీడిత వర్గాలకు సమన్యాయం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందిస్తోంది. గడప గడపకి వెళ్తుంటే ప్రజలు జగన్ వెంట ఉంటామని అంటున్నారు’ అని తమ్మినేని స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలను వివరిస్తూ 17 మంది మంత్రులతో కూడిన బృందం ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రను (YSRCP Samajika Nyaya Bheri Bus Yatra) గురువారం శ్రీకాకుళంలో ఏడు రోడ్ల కూడలి నుంచి ప్రారంభించింది. దారి పొడవునా ప్రజల దీవెనలతో పలు ప్రాంతాల మీదుగా మండుటెండలోనూ తొలిరోజు యాత్ర ఉత్సాహభరితంగా సాగింది. అయితే వర్షం కారణంగా సాయంత్రం విజయనగరంలో నిర్వహించాల్సిన బహిరంగ సభ రద్దైంది. అప్పటికే సభా ప్రాంగణానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సభ నిర్వహణకు సరిగ్గా అరగంట ముందు వర్షం కురవడంతో అనివార్య పరిస్థితుల్లో ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా రద్దు చేయాలని నిర్ణయించారు. బస్సు యాత్ర సందర్భంగా శ్రీకాకుళం ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి. సామాజిక న్యాయభేరి రథానికి ముందు వేలాది మోటార్ బైక్‌ల ర్యాలీ కొనసాగింది. దీంతో కిలోమీటర్ల మేర కోలాహలం నెలకొంది.
శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద ప్రారంభమైన బస్సు యాత్ర బైపాస్, చిలకపాలెం, సుభద్రాపురం, రణస్థలం, పైడిభీమవరం మీదుగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. దారిపొడవునా మంత్రులు ప్రజల్ని కలుసుకుని పలుచోట్ల మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఈ ప్రభుత్వం ఎంత మేలు చేసింది? రాజ్యాధికారంలో ఎలా భాగస్వాములను చేసిందో వివరించారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రతి పల్లె కదలి రావడంతో చిలకపాలెం, రణస్థలం జనసంద్రమైంది. విజయనగరం జిల్లాలో కందివలస, అగ్రహారం, కుమిలి, ముంగినాపల్లి, గుణుపూరుపేట, జమ్ము మీదుగా విజయనగరంలోకి బస్సు యాత్ర ప్రవేశించింది.