Weather Update: ఏపీకి చల్లని కబురు, రెండు మూడు రొజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్న నైరుతి రుతుపవనాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ
Rains (Photo Credits: PTI)

Amaravati, June 15: ఎండలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఇప్పటికే రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు (Southwest monsoon enters Rayalaseema) నెమ్మదిగా రాష్ట్రమంతా విస్తరిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలకు, తర్వాత నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్రలో విస్తరిస్తాయని (to cover state by end of the week) వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాయలసీమలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. కోస్తా జిల్లాల్లో మాత్రం పలుచోట్ల ఎండల తీవ్రత కొనసాగుతోంది.

అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడుతున్నా, ఎక్కువ ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు, హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్నదని ఐఎండీ హెచ్చరిక, రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

ఇదిలా ఉండగా మంగళవారం ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయిలో 41 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంటలో 34, అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయిలో 22.5, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం మంగోలులో 21, పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో 13.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కొండాయిగూడెంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.