Vizag, Dec 8: విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో (duvvada railway station) నిన్న రైలు-ప్లాట్‌ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయి గాయాలపాలైన విద్యార్థిని శశికళ(20) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. యూరిన్ బ్లాడర్ దెబ్బతిని తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో మృత్యువుతో పోరాడుతూ విద్యార్థిని ప్రాణాలు విడిచింది.
అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (Guntur Rayagada Express)లో ఆమె దువ్వాడ చేరుకుంది. స్టేషన్‌లో రైలు దిగుతున్న క్రమంలో రైలు-ప్లాట్‌ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఆమె కాలు పట్టాల వద్ద ఉండిపోవడంతో తీవ్ర గాయాలతో గగ్గోలు పెట్టింది. దీంతో రైల్వే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతి ఇరుక్కున్న చోట ప్లాట్‌ఫామ్‌ను కట్ చేశారు.
గంటన్నర పాటు శ్రమించి ఆమెను బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం షీలా నగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. అయితే యూరిన్ బ్లాడర్ దెబ్బతిని రక్తస్రావం అవుతుండటంతో ఆమెను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కుపోవడంతో ఇతర అవయవాలు కూడా దెబ్బతినడంతో ఆ యువతి కోలుకోలేక మృతిచెందింది.