Amaravati, Sep 28: విశాఖ రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి (YSRCP MP Vijayasai Reddy) మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి సమావేశంలో రైల్వే జోన్ (Visakha Railway zone Row) అంశమే చర్చకు రాలేదన్నారు. విశాఖకు రైలే జోన్ వచ్చి తీరుతుందన్నారు. విశాఖకు రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంపై అక్కసుతోనే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని దుయ్యబట్టారు.
రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని.. విభజన చట్టంలో రైల్వే జోన్ గురించి స్పష్టంగా చెప్పారన్నారు. రామోజీ, రాధాకృష్ణ అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు రాతలపై రామోజీ, రాధాకృష్ణ సమాధానం చెప్తారా?. అవాస్తవాలను ప్రచురించి తమ స్థాయిని దిగజార్చుకోవద్దని విజయసాయిరెడ్డి హితవు పలికారు.
ఇదే విషయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (BJP MP GVL) స్పందించారు.విశాఖ రైల్వే జోన్ రావడం లేదంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో వస్తున్న పుకార్లను, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్తున్నారు. విశాఖ రైల్వే జోన్ రావడం తధ్యం. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రం చర్యలు ఇప్పటికే ప్రారంభించింది.. రైల్వేజోన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
గత పార్లమెంటు సమావేశాల్లో నేను అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సమాధానం కూడా ఇచ్చింది. ఈరోజు ఉదయం కూడా కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ వి కె త్రిపాఠీ మాట్లాడాను. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి’’ అని జీవీఎల్ పేర్కొన్నారు. రైల్వే జోన్ ప్రక్రియ యధాతధంగా కొనసాగుతున్నదన్న ఎంపీ జీవీఎల్.. విశాఖ రైల్వే జోన్ పై వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మొద్దంటూ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.