COVID-19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 58 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1583 కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య; సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతిస్తుండటంతో ఏపీ-టీఎస్ బార్డర్ వద్ద ట్రాఫిక్ జాం
Coronavirus in India | Representational Image (Photo Credits: PTI)

Amaravathi, May 3: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా మరో 58 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19కేసుల సంఖ్య 1583కు చేరింది. నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 47 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 488 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, మరో 33 మంది చికిత్స పొందుతూ మరణించారు. అయితే గత రెండు రోజులుగా కొత్తగా కోవిడ్ మరణాలేమి నమోదు కాలేదు, ప్రస్తుతం ఏపీలో 1062 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

గత 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా కర్నూల్ జిల్లా నుంచే 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత గుంటూరు జిల్లా నుంచి 11, కృష్ణా నుంచి 8, అనంతపూర్ జిల్లాలో కొత్తగా 7 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల నుంచి ఒక్కో కేసు నమోదైంది.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:

status of positive cases of #COVID19 in Andhra Pradesh

నిన్న శనివారం ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు మొత్తం 6534 మందికి చెందిన సాంపిల్స్ ని పరీక్షించగా ఈ 58 మందుకి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

ఏపీ- టీఎస్ బార్డర్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం

ఇదిలా ఉండగా, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ బార్డర్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతిస్తుండటంతో పెద్ద ఎత్తున ప్రజలు తమ వాహనాల్లో సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే రాష్ట్ర సరిహద్దు వద్ద ఏపీ నుంచి వెళ్లే వాహనాలను తెలంగాణ అధికారులు, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వాహనాలను ఏపీ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గరికపాడు చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఇరు రాష్ట్రాలలోని బార్డర్ జిల్లాలకు చెందిన కలెక్టర్లు జోక్యం చేసుకోవడంతో వాహనదారులకు అనుమతి లభించింది.