Leopard (Credits: Twitter)

Tirupati, SEP 07: తిరుమల (Tirumala) లో మరో చిరుత (cheetah) చిక్కింది. తిరుమల కొండపైకి వెళ్లే నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం 7వ మైలు మధ్య ప్రాంతంలో చిరుతను అటవీశాఖ అధికారులు (Forest officials) బోనులో బంధించారు. ఇప్పటికే రెండు నెలల కాలం వ్యవధిలో తిరుమల నడక మార్గం (Tirumala Walkway) లో నాలుగు చిరుతలను అధికారులు బంధించారు. తాజాగా గురువారం తెల్లవారుజామున ఐదో చిరుత అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది. నడక మార్గంలో టీటీడీ, అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. నాలుగు రోజులక్రితం ట్రాప్ కెమెరాలో చిరుత సంచారాన్ని గమనించిన అధికారులు దానిని బంధించేందుకు బోనులను ఏర్పాటు చేశారు. నరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కుకుంది. దీంతో అధికారులు, భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

గత నెలలో తిరుమల కొండపైకి నడకమార్గంలో వెళ్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలికను అలిపిరి వద్ద చిరుత పులి దాడిచేసి హతమార్చిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమయిన అధికారులు తిరుమల గిరుల్లో పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. దీనికితోడు నడక మార్గంలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. గత నెలలోనే అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనుల్లో మూడు చిరుతలు చిక్కాయి. దీంతో చిరుతల భయం పోయిందని భావించారు. గత నాలుగు రోజుల క్రితం అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో మరో చిరుత ఉన్నట్లు గుర్తించారు. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే, గురువారం తెల్లవారు జామున అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలాఉంటే.. గత నెలలో బాలిక మృతి ఘటన తరువాత నడక మార్గంలో భక్తుల రద్దీ తగ్గింది.

Tirumala: గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం, యువతలో సనాతన ధర్మం పట్ల అవగాహన పెంచేందుకు టీటీడీ కీలక నిర్ణయం, టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవిగో.. 

తిరుమల నడకమార్గంలో భక్తులకు టీటీడీ అధికారులు చేతి కర్రలు ఇచ్చారు. బుధవారం భక్తులు అధికారులు అందించిన కర్రలతో నడకమార్గంలో కొండపైకి వెళ్లారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కర్ర చేతిలో ఉంటే భక్తుల్లో ఆత్మ విశ్వాసం, మనోధైర్యం పెరుగుతుందని అన్నారు. చేతిలో కర్ర ఉంటే జంతువులు దాడి చేయవనే శాస్త్రీయ వాదన ఉందని తెలిపారు. టీటీడీ నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. చేతికర్రలు ఇస్తే ఉపయోగం ఉండదని, ఫెన్సింగ్ వేయాలని కోరుతున్నారు. దీనిపై టీటీడీ చైర్మన్ స్పందిస్తూ.. ఫెన్సింగ్ ఏర్పాటుకు కేంద్ర అటవీశాఖ ఆధ్వర్యంలోని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.