Amaravati, Sep 15: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly Session 2022) అధికార వికేంద్రీకరణకు సంబంధించిన అంశంపై జరుగుతున్న స్వల్పకాలిక చర్చలో భాగంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు మాత్రమే భూములు కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనమని కూడా ఆయన ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
ఏపీ రాజధాని అమరావతిలోనే వస్తుందని టీడీపీ నేతలకు మాత్రమే ఎలా తెలిసిందని కూడా బుగ్గన ప్రశ్నించారు. అందరికంటే ముందు ఏపీ రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకున్న టీడీపీకి చెందిన చాలా మంది నేతలు అమరావతిలో భూములు కొన్నారని ఆయన అన్నారు.
అలా అమరావతిలో భూములు కొన్నవారిలో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కుమారుడు విక్రమ్ సింహ కూడా ఉన్నారన్నారు. చంద్రబాబు కుటుంబం ఆధ్వర్యంలోని హెరిటేజ్ సంస్థ కూడా అమరావతిలో 14 ఎకరాలు కొనుగోలు చేసిందని బుగ్గన ఆరోపించారు.