విజయవాడ, జనవరి 29: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పదే పదే వివాదాలకు తన మాటలతో తావు కల్పిస్తున్నారు. ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్నది పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. తాజాగా కడప జిల్లా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్షమాపణలు చెప్పారు. ఇటీవల రాయలసీమ, కడప ప్రాంత ప్రజలపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. హత్యల చేసే వారికి ఎయిర్ పోర్టులు ఎందుకు అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు అని ప్రకటించిన నేపథ్యంలో సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం రేగింది. రాయలసీమ జిల్లాకు చెందిన నేతలు అనేక మంది అభ్యంతరం తెలిపారు.
సీమ ప్రాంత ప్రాశస్త్యాన్ని తెలుసుకోకుండా సోము వీర్రాజు మాట్లాడుతున్నారని విమర్శించారు. పెద్దయెత్తున విమర్శలు వస్తుండటంతో సోము వీర్రాజు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. కడప ప్రజలకు సోము వీర్రాజు క్షమాపణలు చెప్పారు. తాను వాడిన పదాలతో రాయలసీమ వాసుల మనసులు గాయపడ్డాయని ఆయన అన్నారు.