Vijayawada, OCT 06: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగుల బదిలీలు, ఖాళీల భర్తీపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (AP CEO) ముఖేశ్‌కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఓటర్ల తుది జాబితా రూపొందించే వరకూ నియామకాలు, బదిలీలపై (Transfers) ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. 2024 జనవరి 5వ తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా (AP Voters List) రూపకల్పన ప్రక్రియలో కీలకంగా ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలకు సంబంధించి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. ఈ వ్యవహారంలో నిబంధనలు పాటించకుంటే ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.
‘‘ఓటర్ల తుది జాబితా రూపకల్పన ప్రక్రియలో భాగస్వాములైన అధికారుల బదిలీల కారణంగా ఆ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతుంది. జాబితా నాణ్యత, రివిజన్ ప్రక్రియ దెబ్బతింటుంది. అందుకే జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్వోలు, తహసీల్దార్లు తదితర అధికారులను బదిలీ చేయకూడదు. బదిలీ అత్యవసరం అయితే ముందస్తుగా సీఈఓ దృష్టికి తేవాలి. గతంలో ఎన్నికల జాబితా రూపకల్పనలో తీవ్ర ఆరోపణలు, కోర్టు కేసులు, క్రమశిక్షణా చర్యలకు గురైన అధికారులు, ఉద్యోగుల పోస్టింగ్ అంశాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలి. 2023 అక్టోబర్ 27 తేదీ నుంచి 2024 జనవరి 5 తేదీ ముసాయిదా జాబితా ప్రకటించేంత వరకూ బదిలీలు నిలిపివేయాల్సిందే. 2023 అక్టోబర్ 27 నాటికి ముసాయిదా జాబితా, అలాగే 2024 జనవరి 5 తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తాం’’ అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.