ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు తిరుపతికి చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 వరకు సమావేశం జరగనుంది. సదరన్ జోనల్ కౌన్సిల్‌లో సీఎం జగన్ స్వాగత ఉపన్యాసం ఇవ్వనున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో ఉన్న సమస్యలను ప్రస్తావించనున్నారు.
భారీ వర్షాలు, బాధితులను ఆదుకునేందుకు స్వయంగా సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ పనుల్లో నిమగ్నమై ఉన్నందున సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకాలేకపోతున్నానని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు.
ఈ సమావేశానికి కర్ణాటక సీఎం బొమ్మై, తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన అతిథులను సీఎం జగన్ సత్కరించారు.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు పొరుగు రాష్ట్రాల వద్ద అపరిష్కృతంగా ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించాల్సిందిగా ఆదివారం తిరుపతిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమావేశంలో ఆరుకు పైగా అంశాలను ప్రస్తావించేందుకు అజెండా రూపొందించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, వివిధ పెండింగ్ సమస్యలను ప్రస్తావించి త్వరగా పరిష్కరించాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అండమాన్–నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌లకు ఆహ్వానం అందింది.