Kurnool, Feb 14: కర్నూలు రోడ్డు ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సహాయ సహకారాలు అందించి వెంటనే ఆదుకోవాలని పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాద ఘటనపై (Kurnool Road Accident) ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలు ప్రమాద ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.
మృతులు 14 మంది కుటుంబాలకు రూ.2 లక్షలు (ap cm ys Jagan announced Ex-gratia of Rs 2 lakh) చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. గాయపడిన నలుగురికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. రేపు మదనపల్లికి వెళ్లి చెక్కులు అందజేస్తామని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandrareddy) వెల్లడించారు.
కాగా టెంపో మినీ బస్సు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చోటుచేసుకుందని ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ వెల్లడించారు. ప్రమాద కారణాలను ప్రత్యేక సాంకేతిక బృందంతో సమగ్ర విచారణ చేపడుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. మృతుల వివరాలను చిత్తూరు జిల్లా అధికారులకు సమాచారం అందించామని ఆయన తెలిపారు.
కర్నూలు ప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దిగ్భ్రాంతి చెందారు. కర్నూలు జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వోతో ఫోన్‌లో ఆళ్ల నాని మాట్లాడారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను అడిగితెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.